ఐపీవోకు మూడు కంపెనీలు రెడీ

27 Dec, 2021 06:07 IST|Sakshi

సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు

జాబితాలో క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌..

టీబీవో టెక్, ప్రొటియన్‌ ఈగోవ్‌ టెక్‌

న్యూఢిల్లీ: ఈ క్యాలండర్‌ ఏడాదిలో సెకండరీ మార్కెట్లతో పోటీ పడుతున్న ప్రైమరీ మార్కెట్‌ పలు అన్‌లిస్టెడ్‌ కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది 65  కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా సుమారు రూ. 1.3 లక్షల కోట్లు సమీకరించాయి. ఈ బాటలో తాజాగా మరో మూడు సంస్థలు ఐపీవో బాట పట్టాయి. జాబితాలో స్పోర్ట్స్, అథ్లెటిక్‌ ఫుట్‌వేర్‌ కంపెనీ క్యాంపస్‌ యాక్టివ్‌వేర్, ట్రావెల్‌ సర్వీసుల సంస్థ టీబీవో టెక్‌ లిమిటెడ్, ఐటీ ఆధారిత సొల్యూషన్ల కంపెనీ ప్రొటియన్‌ ఈగోవ్‌  టెక్నాలజీస్‌ చేరాయి. ఈ మూడు కంపెనీలూ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు అనుమతిని కోరుతూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా దరఖాస్తు చేశాయి. వివరాలు చూద్దాం..

క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌  
స్పోర్ట్స్, అధ్లెస్యూర్‌ ఫుట్‌వేర్‌ విభాగంలో క్యాంపస్‌ బ్రాండును కలిగిన క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ నిధుల సమీకరణ సన్నాహాలు ప్రారంభించింది. ఐపీవోలో భాగంగా 5.1 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్‌ చేయనున్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు హరి కృష్ణ అగర్వాల్, నిఖిల్‌ అగర్వాల్‌కు సంయుక్తంగా 78.21 శాతం వాటా ఉంది. 2005లో ప్రారంభమైన క్యాంపస్‌ బ్రాండు విలువరీత్యా ఆర్గనైజ్‌డ్‌ మార్కెట్లో 15 శాతం వాటాను కలిగి ఉంది.  

టీబీవో టెక్‌
ట్రావెల్‌ సర్వీసుల కంపెనీ టీబీవో టెక్‌ లిమిటెడ్‌ ఐపీవో ద్వారా రూ. 2,100 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇందుకు వీలుగా రూ. 900 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 1,200 కోట్ల విలువైన ఈక్విటీని ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. తాజా ఈక్విటీ నిధులను వ్యూహాత్మక కొనుగోళ్లు, క్రయవిక్రయాల ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి, ఇతర కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.      

ప్రొటియన్‌ ఈగోవ్‌
గతంలో ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ గవర్నెన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా వ్యవహరించిన ప్రొటియన్‌ ఈగోవ్‌ టెక్నాలజీస్‌ నిధుల సమీకరణకు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేయనుంది. 1995లో ప్రారంభమైన ప్రభుత్వంతో చేతులు కలపడం ద్వారా గ్రీన్‌ఫీల్డ్‌ టెక్నాలజీ సొల్యూషన్లను అందిస్తోంది. ఐటీ ఆధారిత సేవల ఈ కంపెనీ జాతీయస్థాయిలో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కొత్తతరహా ప్రజాసంబంధ ఈగవర్నెన్స్‌ సొల్యూషన్లు సమకూరుస్తోంది.  

మరిన్ని వార్తలు