23 శాతం ప్రీమియంతో లిస్టయిన క్యామ్స్‌ 

1 Oct, 2020 10:49 IST|Sakshi

గత నెల 23న ముగిసిన ఐపీవో ధర రూ. 1,230

బీఎస్‌ఈలో రూ. 1,518 వద్ద ట్రేడింగ్‌ షురూ

ఐపీవో ద్వారా 37.48% వాటా విక్రయించిన ఎన్‌ఎస్‌ఈ

రూ. 2242 కోట్ల సమీకరణ-  రూ. 667 కోట్ల యాంకర్‌ పెట్టుబడులు

గత నెలలో ఐపీవోకి వచ్చిన కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌- క్యామ్స్‌(CAMS) లాభాల లిస్టింగ్‌ను సాధించింది.  ఇష్యూ ధర రూ. 1,230కాగా.. బీఎస్‌ఈలో 23 శాతం(రూ. 288) ప్రీమియంతో రూ. 1,518 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. తదుపరి అమ్మకాలు పెరగడంతో కొంతమేర వెనకడుగు వేసింది. రూ. 1,306 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. ఇదే విధంగా రూ. 1,550 వద్ద గరిష్టాన్నీ తాకింది. ప్రస్తుతం రూ. 194 లాభంతో రూ. 1,424 వద్ద ట్రేడవుతోంది. 

47 రెట్లు
సెప్టెంబర్‌ 21-23 మధ్య ఐపీవో చేపట్టిన క్యామ్స్‌.. తద్వారా రూ. 318 కోట్లను సమీకరించింది. ఇష్యూ 47 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఐపీవోలో భాగంగా క్యామ్స్‌.. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ. 667 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 1230 ధరలో 35 సంస్థలకు షేర్లను విక్రయించింది. వెరసి స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈకి భారీ వాటా ఉన్న కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌- క్యామ్స్‌(CAMS) ఇష్యూ ద్వారా రూ. 2242 కోట్లవరకూ సమకూర్చుకుంది. సెబీ నిబంధనల ప్రకారం క్యామ్స్‌లో గల మొత్తం 37.48 శాతం వాటాను పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ఎన్‌ఎస్‌ఈ విక్రయించింది. తద్వారా కంపెనీ నుంచి ఎన్‌ఎస్‌ఈ వైదొలగింది. క్యామ్స్‌లో మరో ప్రమోటర్‌ కంపెనీ గ్రేట్‌ టెరైన్‌కు 43.53 శాతం వాటా ఉంది. ఐపీవో తదుపరి ఈ వాటా 30.98 శాతానికి పరిమితంకానుంది. పీఈ దిగ్గజం వార్‌బర్గ్‌ పింకస్‌కు చెందిన కంపెనీ ఇది.
 
ఇతర వివరాలు..
1988లో ఏర్పాటైన క్యామ్స్‌లో ప్రధాన ప్రమోటర్‌ గ్రేట్‌ టెరైన్‌ ప్రస్తుతం 31 శాతం వాటాను కలిగి ఉంది. దేశీయంగా మ్యూచువల్‌ ఫండ్స్‌కు అతిపెద్ద రిజిస్ట్రార్‌, ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్‌గా సేవలందిస్తోంది. దేశీ ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల సగటు రీత్యా చూస్తే క్యామ్స్‌ 70 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020 జులైకల్లా దేశంలోని అతిపెద్ద 15 ఫండ్‌ హౌస్‌లలో 9 సంస్థలను క్లయింట్లుగా కలిగి ఉంది. టాప్‌-5 ఎంఎఫ్‌లలో నాలుగింటికి సేవలందిస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు