దేన్నీ వదలని ‘డీప్‌ఫేక్‌’ ముఠా..! ఫొటోలు వైరల్‌

22 Dec, 2023 15:48 IST|Sakshi

ఓ ప్రముఖ నటి స్టెప్పులు వేసిన పాటకు మరో నటి స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో మార్ఫ్‌ చేసి చూపిస్తే వావ్‌ అని అబ్బురపడతాం. ఓ 30-40 ఏళ్ల తర్వాత మనం ఎలా కనిపిస్తామో ముందే తెలుసుకోగలిగితే సూపర్‌ టెక్నాలజీ అని సంబరపడుతాం. అదే టెక్నాలజీ మన ముఖంతో మోసాలకు తెగబడితే.. పరువును బజారులో నిలబెడితే..! సరిగ్గా ఇప్పుడదే జరుగుతోంది. ఇటీవల ప్రముఖ హీరోయిన్‌ రష్మిక విషయంలో జరిగిందిదే. డీప్‌నెక్‌ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకున్న వేరే అమ్మాయి వీడియోను మార్ఫింగ్‌ చేసి రష్మికలా రూపొందించిన విషయం తెలిసిందే. 

తాజాగా అమూల్ బ్రాండ్ పై కూడా డీప్ ఫేక్ మరక పడింది. అమూల్ సంస్థ  జున్నును శరం పేరుతో మార్కెట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి ఏఐ ద్వారా సృష్టించినవని.. అటువంటి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయలేదని అమూల్ సంస్థ స్పష్టం చేసింది.

శరం పేరుతో అమూల్ కొత్త రకం చీజ్ విడుదల చేసినట్లు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్‌ల్లో ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. దానికి కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని అమూల్ సంస్థ తేల్చి చెప్పింది. వినియోగదారులు ఫేక్‌ న్యూస్‌, ఫేక్‌ ఫొటోలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ చిత్రాన్ని తయారు చేసినట్లు తెలిసింది. తమ బ్రాండ్ పేరు చెడగొట్టేందుకే ఇలాంటి డీప్ ఫేక్ చిత్రాలను వైరల్‌ చేస్తున్నారని సంస్థ పేర్కొంది. ఈ పోస్టుల ద్వారా తప్పుడు సమాచారం సృష్టించి  వినియోగదారులను అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారని తెలిపింది. వైరల్ అవుతున్న ఫొటోలో అమూల్ లోగోతో లైట్‌ ఎల్లో కలర్‌ ప్యాకెట్, పెద్ద ఫాంట్‌లో శరం అనే పదాన్ని చిత్రీకరించారు. 

ఇదీ చదవండి: టోల్‌ప్లాజా తొలగింపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు

అముల్‌ బ్రాండ్‌పై ఇలాంటి వైరల్‌ న్యూస్‌, ఫొటోలు వైరల్‌ కావడం కొత్తేమి కాదు. గతంలో అమూల్ లస్సీ ప్యాకెట్‌లో ఫంగస్ ఉందని సోషల్ మీడియాలో  వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు ఫేక్  అని కేవలం వినియోగదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని సంస్థ కొట్టిపారేసింది.

>
మరిన్ని వార్తలు