రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం: బ్యాంక్‌ వినియోగదారులకు షాక్‌, వడ్డీ రేట్ల పెంపు లేనట్లే?!

9 Mar, 2022 15:48 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రష్యా–ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు, గ్యాస్, బొగ్గు వంటి కమోడిటీల సరఫరాకు సంబంధించి మరిన్ని సమస్యలు తలెత్తవచ్చని యూటీఐ ఏఎంసీ ఫండ్‌ మేనేజర్‌ అంకిత్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇంధనాల ధరలు ఇప్పటికే అధిక స్థాయిలో ఉన్నాయని, ఇకపై మరింతగా పెరగవచ్చని పేర్కొన్నారు. 

ఫెడ్‌ రేట్లు మరికొంతకాలం యథాతథమే!
‘‘ఈ నేపథ్యంలో అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ సహా సెంట్రల్‌ బ్యాంకులు..వడ్డీ రేట్ల పెంపును కాస్త వాయిదా వేసే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఎగిసిందంటే వినియోగదారుల్లో ఖర్చు చేసే సామర్థ్యాలు దెబ్బతింటాయి. కనుక ఇలాంటప్పుడు వడ్డీ రేట్లను వేగంగా పెంచితే ప్రతికూల పరిస్థితులు తలెత్తవచ్చు. దేశీ మార్కెట్లు గణనీయంగా పెరిగిన దృష్ట్యా సాధారణంగానే ఎంతో కొంత కరెక్షన్‌కు గురవుతాయి. అందుకోసం వాటికి ఏదో ఒక కారణం అవసరమవుతుంది. అది ఈ రూపంలో వచ్చిందని భావించవచ్చు’’ అని అగర్వాల్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు వివరించారు. 

ఇన్వెస్ట్‌ చేయాలంటే
మదుపునకు సంబంధించి రంగాల వారీగా చూస్తే నిర్మాణ మెటీరియల్స్, కన్జూమర్‌ సర్వీసులు, హెల్త్‌కేర్‌ మొదలైనవి సానుకూలంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఇక దేశీయంగా తయారీ కార్యకలాపాలు పెరుగుతున్న క్రమంలో పారిశ్రామిక రంగ సంస్థలు, స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీలు, కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలు మెరుగ్గా ఉండవచ్చని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మిడ్‌క్యాప్‌ల పనితీరు అన్నది ఆయా సంస్థల ఆదాయాలపై ఆధారపడనుందని అగర్వాల్‌ వివరించారు.

లాంగ్‌టర్మ్‌ బెస్ట్‌
ప్రస్తుతం మార్కెట్లో మదుపు చేద్దామనుకుంటే..దీర్ఘకాలిక ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుందని, కనీసం 3–5 ఏళ్ల వ్యవధికి ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని పేర్కొన్నారు. దీనివల్ల సమీప భవిష్యత్తులో ఒడిదుడుకుల గురించి ఎక్కువగా ఆందోళన ఉండదని చెప్పారు. తమ కంపెనీపరంగా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఉన్నవి లేదా టర్నెరౌండు సామర్థ్యాలు ఉన్న వాటిపై ఎక్కువగా దృష్టి పెడతామని, తద్వారా కాలక్రమంలో మెరుగైన రాబడులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు