రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌..లాభాలు డౌన్‌...నిర్మాణ రంగంపై పెను ప్రభావం..!

12 Apr, 2022 08:17 IST|Sakshi

జనవరి–మార్చిలో మార్జిన్లు డీలా

రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ అంచనాలు

ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో దేశీ కంపెనీల నికర లాభాలు తగ్గనున్నట్లు రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ తాజాగా అంచనా వేసింది. పెరిగిన ముడివ్యయాల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయలేకపోవడంతో లాభాల మార్జిన్లు నీరసించనున్నట్లు నివేదికలో అభిప్రాయపడింది. క్యూ4(జనవరి–మార్చి)లో నిర్వహణ లాభ మార్జిన్లు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం స్థాయిలో క్షీణించనున్నట్లు పేర్కొంది. అయితే క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)తో పోలిస్తే 0.6 శాతం బలపడవచ్చని రీసెర్చ్‌ విభాగం రూపొందించిన నివేదికలో క్రిసిల్‌ తెలియజేసింది. క్యూ4 ఫలితాల సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో నివేదికకు ప్రాధాన్యత ఏర్పడింది. వార్షిక ప్రాతిపదికన ఒక క్వార్టర్‌లో లాభాల మార్జిన్లు బలహీనపడటం గత మూడేళ్లలో ఇది రెండోసారని వెల్లడించింది.  

పూర్తి ఏడాదికి 
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నిర్వహణ లాభాలు(ఇబిటా) 0.4 శాతం వెనకడుగుతో 21–23 శాతంగా నమోదుకావచ్చని క్రిసిల్‌ డైరెక్టర్‌ హెటల్‌ గాంధీ అంచనా వేశారు. పెరిగిన ముడివ్యయాల భారాన్ని పూర్తిస్థాయిలో ప్రొడక్టు ధరలకు బదలాయించలేకపోయినట్లు గాంధీ తెలియజేశారు. ప్రధానంగా మెటల్స్, ఎనర్జీ రంగాలపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా కమోడిటీల ధరలు ప్రభావితమైనట్లు వెల్లడించారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో లాభాల మార్జిన్లు 1 శాతంమేర క్షీణించనున్నట్లు అభిప్రాయపడ్డారు.  

6 శాతంవరకూ 
నిర్మాణ రంగ సంబంధ రంగాల మార్జిన్లకు భారీగా దెబ్బ తగలనున్నట్లు నివేదిక పేర్కొంది. 6 శాతం వరకూ మార్జిన్లు క్షీణించనున్నట్లు నివేదిక అంచనా కట్టింది. ఈ బాటలో ఎగుమతి ఆధారిత ఇండస్ట్రియల్‌ కమోడిటీల రంగం లాభదాయకత(మార్జిన్లు) సైతం 4 శాతం స్థాయిలో తగ్గనున్నట్లు తెలియజేసింది. ఇక వినియోగ ఆధారిత సర్వీసుల రంగంలో లాభాల మార్జిన్లు స్వల్పంగా పుంజుకునే వీలుంది. టారిఫ్‌లను పెంచడంతో టెలికం కంపెనీలు బలపడనుండగా.. నిత్యావసర వస్తు సేవలు, వైద్య రంగం లబ్ది పొందనున్నాయి. కాగా.. పలు రంగాలలో ఆదాయాలు కరోనా మహమ్మారి ముందు దశకు చేరుకునే వీలున్నట్లు నివేదిక తెలియజేసింది. వ్యవసాయ రంగం సైతం వేగవంత రికవరీ సాధిస్తున్నట్లు క్రిసిల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ సేహుల్‌ భట్‌ పేర్కొన్నారు. కంపెనీల మొత్తం ఆదాయం గతేడాది 26 శాతం జంప్‌చేయనున్నట్లు నివేదిక అంచనా వేసింది.  

చదవండి: శ్రీరామ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో కేకేఆర్‌ 

మరిన్ని వార్తలు