Credit Suisse: అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంక్షోభం!

16 Mar, 2023 01:18 IST|Sakshi

వారం రోజుల్లో మూతబడిన రెండు అమెరికన్‌ బ్యాంకులు

తాజాగా క్రెడిట్‌ సూసీపైనా నీలినీడలు

షేరు 27 శాతం పతనం

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: దాదాపు పదిహేనేళ్ల క్రితం తరహాలో అంతర్జాతీయంగా మరో బ్యాంకింగ్‌ సంక్షోభం ముప్పు ముంచుకు రాబోతోందా? అమెరికా, యూరప్‌వ్యాప్తంగా బ్యాంకుల పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు మూతబడగా తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్‌ సూసీ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

బ్యాంకులో మరింతగా ఇన్వెస్ట్‌ చేసేది లేదంటూ కీలక ఇన్వెస్టరు ప్రకటించడంతో క్రెడిట్‌ సూసీ షేర్లు బుధవారం 27 శాతం పతనమయ్యాయి. గత రెండేళ్లలో బ్యాంకు షేరు సుమారు 85 శాతం క్షీణించింది. డిఫాల్ట్‌ అయ్యే అవకాశాలు 40 శాతం మేర ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్‌ రంగం పరిస్థితులపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.  

సమస్యలతో సతమతం..
వాస్తవానికి క్రెడిట్‌ సూసీ గత కొన్నాళ్లుగా సమస్యలతో సతమతమవుతూనే ఉంది. 2019లో సంస్థ సీవోవో పియరీ ఆలివర్‌ కొందరు ఉన్నత స్థాయి ఉద్యోగులపై నిఘా పెట్టేందుకు ప్రైవేట్‌ డిటెక్టివ్‌ను నియమించుకున్నారు. అయితే సదరు డిటెక్టివ్‌ అనుమానాస్పద రీతిలో మరణించిన తర్వాత ఆలివర్‌ను క్రెడిట్‌ సూసీ తొలగించింది. ఇదంతా బ్యాంకు వ్యవహారంపై సందేహాలు రేకెత్తించింది.

అటుపైన 2021లో ఆర్చిగోస్‌ క్యాపిటల్‌ అనే అమెరికన్‌ హెడ్జ్‌ ఫండ్‌ సంస్థ మూతబడటంతో దాదాపు 5 బిలియన్‌ డాలర్ల భారీ నష్టం మూటకట్టుకుంది. ఆ కంపెనీకి క్రెడిట్‌ సూసీ బ్రోకరేజి సర్వీసులు అందించేది. అటు పైన గ్రీన్‌సిల్‌ క్యాపిటల్‌ అనే మరో సంస్థ మూతబడటంతో.. దాని ప్రభావాల కారణంగా ఇన్వెస్టర్లు 3 బిలియన్‌ డాలర్ల దాకా నష్టపోయారు. గతేడాది ఫిబ్రవరిలో దాదాపు 100 బిలియన్‌ డాలర్ల పైగా డిపాజిట్లు ఉన్న 30,000 మంది పైచిలుకు ఖాతాదారులపై మనీలాండరింగ్, అవినీతి తదితర ఆరోపణలు రావడంతో సంస్థ ప్రతిష్ట మరింత మసకబారింది.

దీంతో క్రమంగా డిపాజిట్ల విత్‌డ్రాయల్స్‌ మొదలయ్యాయి. 2019 నుంచి టాప్‌ లీడర్‌షిప్‌ ఇప్పటికి అనేక సార్లు మారింది. గతేడాది క్రెడిట్‌ సూసీ పెట్టుబడుల కోసం అన్వేషిస్తుండగా.. సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ 1.5 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. సంస్థలో మరింతగా ఇన్వెస్ట్‌ చేసే యోచన లేదని సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ అమ్మార్‌ అల్‌ ఖుదైరీ ప్రకటించడం తాజాగా క్రెడిట్‌ సూజీ షేర్ల పతనానికి దారి తీసింది.  2018లో 16 స్విస్‌ ఫ్రాంకులుగా ఉన్న షేరు ప్రస్తుతం 1.70 ఫ్రాంకులకు (ఒక స్విస్‌ ఫ్రాంక్‌ విలువ సుమారు రూ. 89). పడిపోయింది.  

మార్కెట్లలో ప్రకంపనలు..
ఇప్పటికే అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) మూతబడటం, తాజాగా క్రెడిట్‌ సూసీ పరిణామాలతో ఇతరత్రా బ్యాంకులపైనా ప్రభావం పడింది. బుధవారం పలు యూరోపియన్‌ బ్యాంకుల షేర్లు రెండంకెల స్థాయిలో క్షీణించాయి. ఫ్రాన్స్‌కు చెందిన సొసైటీ జనరల్‌ 12 శాతం, బీఎన్‌పీ పారిబా 10 శాతం, జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంక్‌.. బ్రిటన్‌ సంస్థ బార్‌క్లేస్‌ బ్యాంక్‌ మొదలైనవి సుమారు 8 శాతం పడిపోయాయి. రెండు ఫ్రెంచ్‌ బ్యాంకుల్లోనూ కొంత సమయం పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. అటు అమెరికాలో బ్యాంకులూ అదే బాటలో పయనించాయి. ప్రధానంగా డిపాజిటర్లు ఎకాయెకిన డిపాజిట్లను వెనక్కి తీసుకునే రిస్కులు ఉన్న చిన్న, మధ్య రకం బ్యాంకుల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ 17 శాతం, ఫిఫ్త్‌ థర్డ్‌ బ్యాంకార్ప్‌ 6 శాతం, జేపీమోర్గాన్‌ చేజ్‌ 4 శాతం పతనమయ్యాయి.

మరిన్ని వార్తలు