యూనికార్న్‌కు చేరిన డైలీహంట్ స్టార్టప్‌

22 Dec, 2020 16:44 IST|Sakshi

టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు

12 స్థానిక భాషలలో జోష్‌ వీడియో ప్లాట్‌ఫామ్స్‌

బిలియన్‌ డాలర్లకు చేరిన వెర్సే ఇన్నోవేషన్‌ విలువ

బెంగళూరు, సాక్షి: స్టార్టప్ సంస్థ‌.. వెర్సే ఇన్నోవేషన్‌లో తాజాగా టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అల్ఫావేవ్‌(ఫాల్కన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్‌) 10 కోట్ల డాలర్లకుపైగా(సుమారు రూ. 740 కోట్లు) ఇన్వెస్ట్‌ చేశాయి. దీంతో వెర్సే విలువ బిలియన్‌ డాలర్లకు చేరింది. తద్వారా యూనికార్న్‌గా ఆవిర్భవించింది. వెర్నాక్యులర్‌ కంటెంట్‌ ప్లాట్‌ఫామ్‌ డైలీహంట్‌కు మాతృ సంస్థే వెర్సే ఇన్నోవేషన్‌. స్థానిక భాషలలో సేవలందించే తొలి స్టార్టప్‌గా యూనికార్న్‌ హోదాను చేరినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బిలియన్‌డాలర్ విలువకు చేరిన స్టార్టప్‌లను యూనికార్న్‌గా పిలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. (యాపిల్‌ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్‌ కారు!)

ఇతర సంస్థలూ
వెర్సే ఇన్నోవేషన్‌లో ఇప్పటికే వాటాలున్న సోఫినా గ్రూప్‌, లుపా సిస్టమ్స్‌ సైతం తాజాగా ఇన్వెస్ట్‌ చేశాయి. అంతేకాకుండా మ్యాట్రిక్స్‌ పార్టనర్స్‌, సీక్వోయా క్యాపిటల్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ సైతం నిధులు అందించినట్లు తెలుస్తోంది. షార్ట్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ జోష్‌ ద్వారా వెర్సే ఇన్నోవేషన్‌ పలు యాప్స్‌ను విస్తరిస్తోంది. జోష్‌ 12 స్థానిక భాషలలో అందుబాటులో ఉంది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఇండియాకు గతంలో హెడ్‌గా పనిచేసిన ఉమంగ్‌ బేడీ, సహవ్యవస్థాపకుడు వీరూ గుప్తాతో కలసి యాప్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 

1 బిలియన్‌కు
మేడిన్‌ ఇండియా యాప్స్‌ ద్వారా 2025కల్లా 100 కోట్ల యూజర్లకు చేరువకావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా ఫేస్‌బుక్‌ను అధిగమించాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇతర విదేశీ భాషల ఆడియన్స్‌నూ ఆకట్టుకునేందుకు ప్లాట్‌ఫామ్స్‌ను విస్తరించే యోచనలో ఉన్నారు. 2018లో బేడీ ఫేస్‌బుక్‌ను వీడి డైలీహంట్‌లో చేరారు. ప్రస్తుతం జోష్‌ యాప్‌కు 7.7 కోట్ల మంది నెలవారీ యూజర్లున్నట్లు డైలీహంట్ చెబుతోంది. 3.6 కోట్ల మంది రోజువారీ యూజర్లతోపాటు.. 1.5 బిలియన్‌ వీడియోలను ప్లే చేస్తున్నట్లు తెలియజేసింది. మొత్తంగా 30 కోట్ల మంది యూజర్లు తమ స్థానిక భాషల కంటెంట్‌ను వినియోగిస్తున్నట్లు వివరించింది.

మరిన్ని వార్తలు