ఎయిరిండియాకు షాక్‌,  భారీ జరిమానా

14 Jun, 2022 15:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టాటా గ్రూపు యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్‌ ఇచ్చింది. ప్రయాణీకులను విమానం ఎక్కకుండా అక్రమంగా నిరోధించినందుకు గాను  రూ. 10 లక్షల జరిమానా విధించింది. చెల్లుబాటు అయ్యే టికెట్లు కలిగి ఉన్నా ప్రయాణికులను బోర్డింగ్ నిరాకరించిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు డీజీసీఏ వెల్లడించింది. 

చెల్లుబాటు అయ్యే టిక్కెట్‌లున్నా, వాటిని సమయానికి ప్రెజెంట్ చేసినప్పటికీ, అనేక విమానయాన సంస్థలు బోర్డింగ్ నిరాకరించిన వచ్చిన ఫిర్యాదుల నివేదికల నేపథ్యంలో డీజీసీఏ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అదే విధంగా మార్గదర్శకాలను కొన్ని విమానయాన సంస్థలు వాటిని పాటించడం లేదని  మండిపడింది.  బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో వరుస తనిఖీల తర్వాత ప్రకటన జారీ చేసింది. అకారణంగా ప్రయాణీకులను బోర్డింగ్‌కు నిరాకరించిన ఎయిరిండియాపై రెగ్యులేటరీ భారీ జరిమానా విధించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్షన్‌లో భాగంగా ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని  కూడా హెచ్చరించింది.

2010 నిబంధనల ప్రకారం వ్యాలిడ్ టికెట్లు ఉన్నప్పటికీ ప్యాసింజర్లను బోర్డింగ్‌కు అనుమతించని సందర్భంలో వారికి గంటలోపే మరో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలని డీజీసీఏ తెలిపింది. గంటలోపే ప్రత్యామ్నాయం విమానాన్ని ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎలాంటి పరిహారం అందిచాల్సిన అవసరం ఉండదని  స్పష్టం చేసింది.  ఆయా ప్రయాణీకులకు 24 గంటల్లోపు  ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయని పక్షంలో  ప్రయాణికులకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది.  అదే  24 గంటలు దాటితే  రూ. 20 వేల నష్టపరిహారం అందించాలని డీజీసీఏ  పేర్కొంది. 

మరిన్ని వార్తలు