భారీగా పెరిగిన డిజిటల్‌ చెల్లింపులు

12 Oct, 2020 05:03 IST|Sakshi

ఐదేళ్లలో 55.1 శాతం అప్‌...విలువలో 15.2 శాతం వృద్ధి 

ఆర్‌బీఐ గణాంకాల వెల్లడి

ముంబై: నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో భాగంగా ఆర్‌బీఐ డిజిటల్‌ చెల్లింపులను భారీగా ప్రోత్సహిస్తోంది.  దీంతో గత ఐదేళ్లలో ఈ డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరిగాయని ఆర్‌బీఐ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2015 – 2020 మధ్యకాలంలో డిజిటల్‌ పేమెంట్స్‌ చెల్లింపులు 55.1 శాతం చక్రీయ వార్షిక వృద్ధి రేటుతో పెరిగాయి. 2016 మార్చి నాటికి 593.61 కోట్లుగా ఉన్న  డిజిటల్‌ చెల్లింపుల  లావాదేవీలు సంఖ్య మార్చి 2020 చివరి నాటికి 3,434.56 కోట్లకు చేరినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. విలువ పరంగా చెప్పాలంటే ఈ ఐదేళ్లలో డిజిటల్‌ చెల్లింపులు 15.2 శాతం వృద్ధిని సాధించి రూ.920.38 లక్షల కోట్ల నుంచి రూ.1,623.05 కోట్లకు పెరిగాయి.

వార్షిక ప్రాతిపదికగా పరిశీలిస్తే...   
డిజిటల్‌ చెల్లింపుల సంఖ్య 2015–16లో 593.61 కోట్లుగా ఉంది. 2016–17 నాటికి 969.12 కోట్లకు చేరింది. చెల్లింపుల విలువ రూ.1,120.99 లక్షల కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2017–18లో డిజిటల్‌ చెల్లింపుల వ్యాల్యూమ్‌ వృద్ధి 1,459.01 కోట్లుగా ఉండగా, విలువ రూ.1,369.86 లక్షల కోట్లుగా నమోదైంది.   2018 –19లో చెల్లింపుల  సంఖ్య 2,343.40 కోట్లుగా నమోదైంది. చెల్లింపు విలువ రూ.1,638.52 లక్షల కోట్లుగా ఉంది.

2019–20లో లావాదేవీలు పెరిగాయ్‌... విలువ తగ్గింది ...
ఇక 2019–20లో డిజిటల్‌ చెల్లింపులు వాల్యూమ్స్‌ 3,434.56 కోట్లుగా నమోదయ్యాయి. అయితే చెల్లింపు విలువ మాత్రం రూ.1,623.05 లక్షల కోట్ల కు పరిమితమైంది. ఆర్థిక వ్యవస్థ క్షీణత, భారీగా ఉద్యోగాలను కోల్పోవడం తదితర అంశాలు ప్రజల వినియోగ సామర్థ్యాన్ని తగ్గించా యి. ఈ ఏడాదిలో ప్రజలు సొమ్ము భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా అనుకున్న స్థాయిలో చెల్లింపుల విలువ నమోదుకాలేదని విశ్లేషకులంటున్నారు.   

విలువ కొంత తగ్గొచ్చు
కరోనా అంటువ్యాధి, లాక్‌డౌన్‌ పరిమితులు డిజిటల్‌ చెల్లింపులు అనేక రెట్లు పెరిగాయి. అయితే కోవిడ్‌–19 అంటువ్యాధితో ప్రతి ఒక్కరూ అర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో చెల్లింపుల విలువ మరింత తగ్గే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

దశాబ్దం నుంచి క్రమంగా పెరుగుతూ...
పదేళ్ల క్రితం నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఈసీఎస్‌ పేమెంట్స్‌ ద్వారా డిజిటల్‌ పేమెంట్స్‌ వెలుగులోకి వచ్చాయి. ఈ తర్వాత కేంద్రం నోట్ల రద్దుతో డిజిటల్‌ చెల్లింపులకు మరింత ప్రాధాన్యత పెరిగింది. యూపీఐ ఆధారిత, యాప్‌ ఆధారిత చెల్లింపులు.... డిజిటల్‌ చెల్లింపుల సరిహద్దులను చెరివేశాయి. వీటికి తోడు అనేక సంస్థలు.., బ్యాంకింగ్‌యేతర కంపెనీలు డిజిటల్‌ చెల్లింపుల రంగంలో ప్రవేశించడంతో కస్టమర్లు కూడా నగదు చెల్లింపుల నుంచి డిజిటల్‌ చెల్లింపులకు మారడం జరిగింది. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి చెల్లింపు వ్యవస్థలలో పదేళ్ల కిందట ప్రవేశపెట్టిన ఆవిష్కరణలు ఇప్పటికీ సురక్షితంగా పనిచేస్తున్నాయి.  

ఆర్‌బీఐ కృషి అమోఘం
డిజిటల్‌ చెల్లింపుల పరిమాణం, విలువ పెరిగేందుకు ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంది. ఈ చెల్లింపుల వ్యవస్థకు పర్యవేక్షక పాత్ర పోషిస్తూ, నియంత్రణాధికారి బాధ్యత వహిస్తూ డిజిటల్‌ చెల్లింపుల వృద్ధికి కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో ‘‘సురక్షితమైన, సమర్థవంతమైన డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థ అభివృద్ధి, ప్రోత్సాహం’’ అనే తన విధాన లక్ష్యాన్ని సమర్థంగా నిర్వర్తిస్తోంది.

కస్టమర్ల భద్రతే లక్ష్యం..
కస్టమర్ల భద్రత, సౌలభ్యత లక్ష్యంగా డిజిటల్‌ చెల్లింపుల బాటలో ఆర్‌బీఐ పలు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. డిజిటల్‌ పేమెంట్ల పట్ల విశ్వాసం పెంచేందుకు అనేక చర్యలను తీసుకుంది. అందులో భాగంగా గతేడాది(2019) జనవరి నుంచి ఈవీఎం చిప్, పిన్‌ ఆధారిత క్రెడిట్‌/డెబిట్‌ కార్డులను మాత్రమే చెల్లింపులకు వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. టోకనైజేషన్‌ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం దేశం దాటి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు