వాళ్లిద్దరిని క్షమించేద్దామా..? ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌పై 6 లక్షల మంది యూజర్ల రియాక్షన్‌ ఇదే

4 Dec, 2022 12:03 IST|Sakshi

యూఎస్‌ నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్‌ఎస్‌ఏ) విజిల్‌బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్, వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజ్‌లను యుఎస్ ప్రభుత్వం క్షమించాలా? వద్దా? అనే అంశం ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ చర్చకు తెరలేపారు. ఇదే విషయంపై నెటిజన్ల నుంచి అభిప్రాయం తీసుకునేందుకు ఓ పోల్‌ చేశారు. ‘నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు. కానీ పోల్ మాత్రమే చేశాను. అసాంజే, స్నోడెన్‌లను క్షమించాలా?’ అని మస్క్ ట్వీట్ చేశారు. 

అసాంజే,స్నోడెన్ ఇద్దరూ అమెరికా ఆర్మీ, ఇంటెలిజెన్స్‌ చేసిన తప్పులు, వాటి తాలుకూ ఆధారాల్ని బహిర్గతం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న అసాంజేను, రష్యాలో ఉంటున్న స్నోడెన్‌ను దేశానికి రప్పించేలా యూఎస్‌ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్నోడెన్‌కు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రష్యన్ పౌరసత్వం మంజూరు చేశారు. తాజాగా, రష్యా పాస్‌ పోర్ట్ అందుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఇక మస్క్‌ చేసిన పోల్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. పోస్ట్ చేసిన గంటలోపే 560,000 కంటే ఎక్కువ మంది ఓట్‌ చేశారు. వారిలో చాలా మంది యూజర్లు మస్క్‌ ట్వీట్‌కు మద్దతు పలుకుతూ ఓట్‌ చేశారు. ఇద్దరు విజిల్‌బ్లోయర్‌లను క్షమించాలని 79.8 శాతం మంది యూజర్లు అంగీకరిస్తూ ఓటు వేశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది.

మరిన్ని వార్తలు