ఎట్టకేలకు డెలివరీకి సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

14 Dec, 2021 17:39 IST|Sakshi

ఓలా ఎలక్ట్రిక్ కొన్నవారికి శుభవార్త. ఎట్టకేలకు రేపటి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయనున్నట్లు కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు. ఇంతకు ముందు తెలిపినట్లుగా తమిళనాడుకు చెందిన ఈవీ స్టార్టప్ డిసెంబర్ 15 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీని ప్రారంభిస్తుంది. డెలివరీ ప్రక్రియకు ముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను 30,000 మందికి పైగా టెస్ట్ రైడ్ చేసినట్లు తెలిపింది. త్వరలో ఎస్ 1, ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ మరిన్ని నగరాలకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రక్రియ గురుంచి ట్విటర్ వేదికగా భవిష్ అగర్వాల్ ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో "తమిళనాడు కేంద్రంగా ఉన్న తన ఫ్యూచర్ ఫ్యాక్టరీలో డెలివరీ కోసం తొలి బ్యాచ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సిద్ధం చేయడంలో ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులు బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది". అక్టోబర్ 25 - నవంబర్ 25 మధ్య మొదటి బ్యాచ్ స్కూటర్లు డెలివరీలు చేయలని సంస్థ భావించింది. అయితే, సెమీకండక్టర్ చిప్ కొరత వల్ల తేదీని వెనక్కి నెట్టాల్సి వచ్చింది. ఓలా వచ్చే సంవత్సరం 2022 తొలి అర్ధభాగంలో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అవకాశం ఉందని సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. ఈ ఇష్యూ ద్వారా 1 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7,500 కోట్లు) సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం స్టాక్‌మార్కెట్‌ ఒడుదొడుకుల మధ్య కదలాడుతుండటం, ఇటీవల కొన్ని కంపెనీల షేర్లు పేలవంగా నమోదైన నేపథ్యంలో ఆయన ఇలా పేర్కొనడం గమనార్హం.

(చదవండి: ఎల్ఐసీ ఉద్యోగులకు, పెన్షన్ పాలసీదారులకు గుడ్​న్యూస్..!)

మరిన్ని వార్తలు