జేపీ మోర్గాన్‌ చేతికి ఫస్ట్‌ రిపబ్లిక్‌

2 May, 2023 05:08 IST|Sakshi

న్యూయార్క్‌: ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌లో తలెత్తిన సంక్షోభం మొత్తం వ్యవస్థకు వ్యాపించకుండా చూసేందుకు అమెరికా బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి. బ్యాంకు డిపాజిట్లు, అసెట్లలో చాలా మటుకు భాగాన్ని జేపీ మోర్గాన్‌ చేజ్‌ బ్యాంక్‌నకు విక్రయించాయి. అమెరికా చరిత్రలో ఓ భారీ స్థాయి బ్యాంకు విఫలం కావడం ఇది రెండోసారి. 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో వాషింగ్టన్‌ మ్యూచువల్‌ కుప్పకూలింది.

ప్రస్తుత ఫస్ట్‌ రిపబ్లిక్‌ తరహాలోనే అప్పట్లో వాషింగ్టన్‌ మ్యూచువల్‌ను కూడా జేపీ మోర్గాన్‌ చేజ్‌ బ్యాంకే టేకోవర్‌ చేసింది. సోమవారం నుంచి ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌కు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న 84 శాఖలు .. జేపీమోర్గాన్‌ చేజ్‌ బ్యాంక్‌ బ్రాంచీలుగా పనిచేయడం ప్రారంభమవుతుందని ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీఐసీ) వెల్లడించింది.  ఏప్రిల్‌ 13 గణాంకాల ప్రకారం ఫస్ట్‌ రిపబ్లిక్‌కు 229 బిలియన్‌ డాలర్ల అసెట్లు, 104 బిలియన్‌ డాలర్ల మేర డిపాజిట్లు ఉన్నాయి.

పరిమాణం ప్రకారం అమెరికన్‌ బ్యాంకుల్లో 14వ స్థానంలో ఉంది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు సమస్య పరిష్కారానికి డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ ఫండ్‌పై 20 బిలియన్‌ డాలర్ల భారం పడగా, ఫస్ట్‌ రిపబ్లిక్‌పరంగా మరో 13 బిలియన్‌ డాలర్ల మేర  ప్రభావం పడవచ్చని ఎఫ్‌డీఐసీ అంచనా వేసింది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్‌ బ్యాంక్‌లు సంక్షోభంలో చిక్కుకున్న ప్రభావంతో మార్చి నుంచి ఫస్ట్‌ రిపబ్లిక్‌ సైతం సవాళ్లు ఎదుర్కొంటోంది.

తక్కువ వడ్డీ రేట్లకు ఎక్కువగా రుణాలివ్వడం, అధిక శాతం డిపాజిట్లకు బీమా భద్రత లేకపోవడం వంటి అంశాల కారణంగా బ్యాంకుపై డిపాజిటర్లలో నమ్మకం సన్నగిల్లింది. ఫలితంగా బిలియన్ల కొద్దీ డాలర్ల విత్‌డ్రాయల్స్‌ వెల్లువెత్తాయి. ఒక దశలో ఫస్ట్‌ రిపబ్లిక్‌కి సహాయం చేసేందుకు ఇతర బ్యాంకులు కూడా ముందుకు వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో గత వారాంతంలో భేటీ అయిన అమెరికా నియంత్రణ సంస్థలు పరిష్కార మార్గాన్ని అమలు చేశాయి. 

మరిన్ని వార్తలు