సామాన్యులకు కేంద్రం శుభవార్త..తగ్గనున్న వంటనూనె ధరలు!

2 Oct, 2022 20:04 IST|Sakshi

సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెలపై రాయితీతో కూడిన కస్టమ్స్‌ డ్యూటీని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2023 మార్చి 31 వరకు రాయితీ కస్టమ్స్‌ సుంకం కొనసాగుతుందని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) ప్రకటించింది. దీనివల్ల దేశీయంగా వంట నూనెల సరఫరా పెరగడమే కాకుండా, ధరలు నియంత్రణలో ఉంటాయని పేర్కొంది.

ముడి పామాయిల్, ఆర్‌బీడీ పామోలీన్, ఆర్‌బీడీ పామ్‌ ఆయిల్, ముడి సోయా ఆయిల్, రిఫైన్డ్‌ సోయాబీన్‌ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్డ్‌ పొద్దుతిరుగుడు నూనెపై ప్రస్తుత సుంకాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ముడి పామాయిల్, సోయాబీన్‌ ఆయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతులపై సుంకాల్లేవు. కాకపోతే 5 శాతం అగ్రి సెస్, దీనిపై 10 శాతం సంక్షేమ సెస్‌ కలుపుకుని 5.5 శాతం పడుతోంది.

రిఫైన్డ్‌ నూనెలు అయితే, పామాయిల్‌పై 12.5 శాతం, దీనిపై 10 శాతం సామాజిక సంక్షేమ సెస్‌ కలిపి 13.75 శాతం అమల్లో ఉంది. రిఫైన్డ్‌ సోయాబీన్‌ ఆయిల్‌పై ఇది 19.25 శాతంగా అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

చదవండి👉 హోమ్‌ లోన్లపై వడ్డీ రేట్ల బాదుడు

మరిన్ని వార్తలు