ఈవీ రంగంలో ఫోర్డ్ మోటార్స్ భారీగా పెట్టుబడులు

28 Sep, 2021 15:40 IST|Sakshi

ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌ అయిన మన దేశంలో అమెరికన్‌ కంపెనీలు రాణించలేక పోతున్నాయి. ఇక్కడి ప్రజల నాడిని పట్టుకోవడంలో దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు వైఫల్యం చెందుతున్నాయి. ఆశావహ అంచనాలతో అడుగుపెట్టడం.. ఆఖరుకు తట్టా బుట్టా సర్దుకుపోవడం అమెరికా బ్రాండ్లకు పరిపాటిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే, ఇటీవల భారత్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఫోర్డ్ మోటార్స్ ఆటో దిగ్గజం అమెరికాలో మూడు బ్యాటరీ కర్మాగారాలు, ఒక అసెంబ్లీ ప్లాంట్‌ను నిర్మించడానికి దక్షిణ కొరియా సంస్థ ఎస్‌కె ఇన్నోవేషన్ కోతో చేతులు కలిపినట్లు ప్రకటించింది.

బ్యాటరీ కర్మాగారాలు, అసెంబ్లీ ప్లాంట్‌ నిర్మాణ కోసం 11.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫోర్డ్ 7 బిలియన్ డాలర్లు, ఎస్‌కె ఇన్నోవేషన్ కో 4.4 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 11,000 మంది కార్మికులను కూడా నియమించుకుంటున్నట్లు ఫోర్డ్ పేర్కొంది. 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలలో 30 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలనే ఫోర్డ్ ప్రణాళికలో భాగం. ఏడాది క్రితం ఈ సంస్థ పగ్గాలు చేపట్టిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిమ్ ఫార్లీ అన్నీ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారు.(చదవండి: సామాన్యులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు)

మరిన్ని వార్తలు