ఇది యాంత్రిక రికవరీయే..!

24 Aug, 2020 05:56 IST|Sakshi

కొనసాగుతుందనుకోవడం పొరపాటే

ఆర్థిక రికవరీ సంకేతాలపై దువ్వూరి సుబ్బారావు

న్యూఢిల్లీ: ఆర్థిక రంగం కోలుకోవడం అన్నది యాంత్రికంగా చోటు చేసుకుంటున్నదే కానీ..  లాక్‌ డౌన్‌ పరిస్థితుల కారణంగా ఆగిపోయిన ఆర్థిక కార్యకలాపాలు పూర్వపు స్థితికి చేరుకుంటున్నాయని ప్రభుత్వం భావించడం సరికాదంటున్నారు ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు. స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి భారత్‌ వృద్ధి అవకాశాలు చూడ్డానికి బలహీనంగానే ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆర్థిక వ్యవస్థపై తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు.

కరోనా వైరస్‌ రావడానికి పూర్వమే మన దేశ వృద్ధి రేటు 2017–18లో ఉన్న 7 శాతం నుంచి 2019–20లో 4.2 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. ‘‘మీరు పేర్కొంటున్న ఆర్థిక రికవరీ సంకేతాలను లాక్‌ డౌన్‌ నాటి క్షీణించిన పరిస్థితుల నుంచి యాంత్రికంగా జరిగే రికవరీగానే మేము చూస్తున్నాము. దీన్ని మన్నికైన రికవరీగా చూడడం పొరపాటే అవుతుంది. కరోనా మహమ్మారి ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది.

రోజువారీ కేసుల సంఖ్య పెరగడమే కాకుండా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కనుక స్వల్పకాలం నుంచి మధ్య కాలానికి వృద్ధి అవకాశాలు బలహీనంగానే ఉండనున్నాయి. మహమ్మారి సమసిపోయిన తర్వాత (దీన్ని త్వరలోనే చూస్తామన్నది నా ఆశాభావం) ఈ సమస్యలు మరింత పెద్దవి కానున్నాయి. ద్రవ్యలోటు భారీగా పెరిగిపోనుంది. రుణ భారం కూడా భారీగానే ఉంటుంది. ఆర్థిక రంగం దారుణ పరిస్థితులను చూస్తుంది. ఈ సవాళ్లను ఏ విధంగా పరిష్కరించుకుంటామన్న దానిపైనే మధ్యకాల వృద్ధి అవకాశాలు ఆధారపడి ఉంటాయి’’ అంటూ సుబ్బారావు వివరించారు.   

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆశావహం..
ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నడుమ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా కోలుకోవడాన్ని సానుకూల సంకేతంగా దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించడం మంచి చర్యగా పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు కనీస భద్రతా రక్షణలు ఉండడాన్ని తక్కువ మంది గుర్తించిన మరో సానుకూల అంశంగా చెప్పారు. 4 కోట్ల మంది పట్టణ కార్మికులు కరోనా లాక్‌ డౌన్‌ల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయారని, అయినప్పటికీ అక్కడ భారీ కేసులు ఏమీ లేకపోవడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.

ప్రభుత్వ ఖర్చే వృద్ధి చోదకం
ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తగినంత నిధులను ఖర్చు చేయడం లేదన్న విమర్శలకు సుబ్బారావు స్పందిస్తూ.. రుణాలు తీసుకుని ఖర్చు చేయడం ప్రభుత్వానికి పెద్ద కష్టమైన విషయం కాదన్నారు. ‘‘ప్రభుత్వం చేసే వ్యయమే స్వల్పకాలంలో వృద్ధిని నడిపించగలదు. వద్ధికి ఆధారమైన ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు అన్నీ కూడా మందగించి ఉన్నాయి. ఆర్థిక వృద్ధి క్షీణతను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు మరింత ఖర్చు చేయకపోతే మొండి బకాయిలు సహా పలు సమస్యలు ఆర్థిక వ్యవస్థను చుట్టుముడతాయి’’ అని సుబ్బారావు చెప్పారు. అయితే, కేంద్రం రుణాలకు పరిమితి మాత్రం ఉండాలన్నారు.

>
మరిన్ని వార్తలు