పీవోకే మనదే: పార్లమెంట్‌లో అమిత్‌ షా ప్రకటన

6 Dec, 2023 15:43 IST|Sakshi

జమ్ము కశ్మీర్:  పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకే భారత్‌లో అంతర్భాగమేనని ప్రకటించారు. జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో పీవోకేకు ప్రత్యేక స్థానాలు కూడా కేటాయించారు. పీవోకేకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు స్పష్టం చేశారు.

జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేకూర్చడానికి మాత్రమే ఈ బిల్లులను తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. అణగారిని వారిని పైకి తీసుకురావడమే రాజ్యాంగ మూల సూత్రమని పేర్కొన్నారు.

దేశంలో 1980 దశకంలో ఉగ్రవాదం తీవ్రంగా పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో ఓ భాగాన్ని ఆక్రమించుకుని అక్కడి ప్రజలను నిరాశ్రయుల్ని చేశారని మండిపడ్డారు. కశ్మీరీ పండిట్‌లు తమ సొంత దేశంలో శరణార్ధులుగా బతికాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 46,631 కుటుంబాలు, 1,57,968 మంది తమ సొంత స్థలాలను వదిలి వచ్చారని తెలిపారు. ప్రస్తుత బిల్లులతో వారందరికి  హక్కులు కల్పించబడతాయని చెప్పారు.  

"కశ్మీర్‌పై పాకిస్థాన్ 1947లో దాడి చేసింది. ఆ సమయంలో దాదాపు 31,789 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. 1965, 1971 యుద్ధాల సమయంలో 10,065 కుటుంబాలు వలసబాట పట్టాయి. 1947, 1969, 1971 యుద్ధాల్లో మొత్తం 41,844 కుటుంబాలు శరణార్థులుగా తరలివచ్చాయి. ఈ బిల్లు ఆ ప్రజలకు హక్కులు కల్పించడానికి వచ్చిందే" అని అమిత్ షా అన్నారు.

>
మరిన్ని వార్తలు