ఆస్తుల విక్రయంలో ఫ్యూచర్‌ సప్లైకు ఎదురు దెబ్బ

20 Sep, 2022 11:56 IST|Sakshi

అనుమతుల ఆలస్యం ప్రభావం  

న్యూఢిల్లీ: అవసరమైన అనుమతులు పొందడంలో జాప్యం జరుగుతుందన్న అంచనాలతో ఆస్తుల విక్రయ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నట్లు ఫ్యూచర్‌ సప్లై చైన్స్‌ లిమిటెడ్‌(ఎఫ్‌ఎస్‌సీఎల్‌) తాజాగా పేర్కొంది. ఇందుకు బోర్డు ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు వెల్లడించింది. అయితే వ్యాపార కార్యకలాపాల పునరుద్ధరణకున్న ఇతర అవకాశాల అన్వేషణ, పరిశీలన చేపట్టనున్నట్లు ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలియజేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ల పరిష్కారాలను వెదకనున్నట్లు వివరించింది. ఈ అంశాలలో తుది నిర్ణయాలకు వచ్చినప్పుడు వివరాలను అందించనున్నట్లు తెలియజేసింది.

ఎఫ్‌ఎస్‌సీఎల్‌ దేశీయంగా ఆర్గనైజ్‌డ్‌ విభాగంలో అతిపెద్ద థర్డ్‌పార్టీ సప్లై చైన్, లాజిస్టిక్స్‌ సేవలు సమకూర్చే కంపెనీగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. రిటైల్, ఫ్యాషన్, ఆటోమోటివ్‌ తదితర పలు రంగాల కస్టమర్లకు వేర్‌హౌసింగ్, పంపిణీ, ఇతర లాజిస్టిక్స్‌ సొల్యూషన్లు అందిస్తోంది. 2022 జులై 26న కంపెనీ బోర్డు అవసరమైన అనుమతులు పొందాక వేర్‌హౌస్‌ ఆస్తులతోపాటు కొన్ని విభాగాలను విక్రయించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తిరిగి ఈ నెల 13న నిర్వహించిన అత్యవసర వాటాదారుల సమావేశం(ఈజీఎం)లో ఆస్తుల విక్రయానికి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే తాజాగా ఈ ప్రణాళికలను వొదిలిపెడుతున్నట్లు వెల్లడించడం గమనార్హం!

మరిన్ని వార్తలు