కరోనా టీకా షాక్‌ : పసిడి ధర ఢమాల్‌!

9 Nov, 2020 20:31 IST|Sakshi

వెయ్యి రూపాయలు క్షీణించిన బంగారం 

రెండు వేలకుపైగా పతనమైన వెండి ధర

సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందన్న ఆశల మధ్య బంగారం ధరలు అమాంతం దిగి వచ్చాయి. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మన్ భాగస్వామి బయోన్‌టెక్‌తో కలిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్‌  మూడవ దశ ఫలితాల్లో పురోగతి సాధించామన్న ప్రకటనతో పసిడి నేల చూపులు చూసింది. వెండి ధరలు కూడా ఇదే బాట పట్టాయి.  (కరోనా వ్యాక్సిన్‌ : ఫైజర్‌ పురోగతి)

ఫేజ్3 కోవిడ్-19 టీకా ట్రయల్ ఫలితాలు మొదటి సమీక్షలో పురోగతి సాధించిందని ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ రోజు సైన్సు, మానవత్వానికి రెండింటికీ గొప్పరోజు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన వెలువడిన నిమిషాల్లో బంగారం ధర 10 గ్రాములకు 1000 రూపాయలు పతనమైంది. ఎంసీఎక్స్‌ లో డిసెంబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములకి 2 శాతం క్షీణించి 51165 రూపాయల వద్దకు చేరింది. వెండి ఫ్యూచర్స్ 3.5 శాతం లేదా 2205 రూపాయలు పతనమై కిలోకు 63130 కు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో, స్పాట్ బంగారం 2 శాతం క్షీణించి ఔన్స్‌ ధర  1909.99 డాలర్లకు చేరుకుంది.

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తుది దశ పరీక్షల్లో ఇంతవరకు ఎలాంటి సమస్యలు లేవనీ, 90శాతం కంటే ఎక్కువ ప్రభావవంతమైన ఫలితాలొచ్చాయని ఫైజర్‌ సోమవారం ప్రకటించింది. అలాగే ఈ నెలాఖరులో  అమెరికాలో అత్యవసర వినియోగానికి గాను రెగ్యులేటరీ ఆమోదం పొందాలని భావిస్తున్నట్లు చెప్పింది. మరోవైపు కరోనా మహమ్మారి వ్యాక్సిన్‌ అభివృద్ధిలో శాస్త్రవేత్తలు పురోగతి సాధించారన్న అంచనాలతో అమెరికా సహా యూరోపియన్‌ మార్కెట్లు దౌడు తీస్తున్నాయి. డోజోన్స్‌​ ఏకంగా 1500 పాయింట్లు ర్యాలీ కాగా, ఎస్‌ అండ్‌ పీ 500 ఫ్యూచర్స్  రికార్డు గరిష్టానికి చేరడం విశేషం.

మరిన్ని వార్తలు