పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా? 

19 Dec, 2020 12:30 IST|Sakshi

కోవిడ్‌-19 ఎఫెక్ట్‌- 2020లో పసిడి జోరు

దేశీయంగా 32 శాతం, విదేశాల్లో 35 శాతం అప్‌

ఆగస్ట్‌లో ఎంసీఎక్స్‌లో 10 గ్రాములు రూ. 57,100కు

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ 2,067 డాలర్లకు

2021లో 8-10 శాతం కరెక్షన్‌కు చాన్స్‌: నిపుణులు

ముంబై, సాక్షి: కొత్త ఏడాదిలో బంగారం ధరలు 8-10 శాతం స్థాయిలో క్షీణించవచ్చని బులియన్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు ఫండమెంటల్‌, టెక్నికల్‌ అంశాలను ప్రస్తావిస్తున్నాయి. కోవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది పసిడి, వెండి ధరలు ర్యాలీ బాటలో సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే 2021లో కరోనా వైరస్‌ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే యూకే, యూఎస్‌ తదితర దేశాలలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగంలోకిరాగా.. తాజాగా మోడర్నా తయారీ వ్యాక్సిన్‌కు సైతం యూఎస్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మరోవైపు బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ సైతం పలు దేశాలలో ఆశలు రేపుతోంది. దీంతో ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పడితే.. కంపెనీల ఆర్జనలు మెరుగుపడే వీలుంటుంది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సరళతర విధానాలనుంచి దృష్టి మరల్చవచ్చు. దీంతో పసిడి, వెండి ధరలు 8-10 శాతం స్థాయిలో దిద్దుబాటు(కరెక్షన్‌)కు లోనుకావచ్చని బులియన్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా జరిగితే పసిడిలో పెట్టుబడులు చేపట్టడం దీర్ఘకాలంలో మేలు చేయగలదని అభిప్రాయపడ్డారు. (పసిడి, వెండి.. 3 రోజుల లాభాలకు బ్రేక్‌)

సెకండ్‌ వేవ్‌తో
ప్రస్తుతం యూఎస్‌, యూరోపియన్‌ దేశాలలో కోవిడ్‌-19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో కొన్ని దేశాలలో కఠిన ఆంక్షలను సైతం విధిస్తున్నారు. నిజానికి సంక్షోభ పరిస్థితుల్లో పసిడిని రక్షణాత్మక పెట్టుబడిగా భావిస్తుంటారు. దీంతో కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్‌ సంస్థలు, ఇన్వెస్టర్లు పసిడిలో కొనుగోళ్లకు ఆసక్తి చూపే విషయం విదితమే. దీనికితోడు ఇటీవల డాలరు ఇండెక్స్‌ 30 నెలల కనిష్టానికి చేరింది. వెరసి మరికొంతకాలం కోవిడ్‌-19 ప్రభావం కొనసాగితే పసిడి ధరలు రూ. 50,000కు ఎగువనే కొనసాగవచ్చని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండు నెలలుగా ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాములు రూ. 48,000-51,000 మధ్య కదులుతుండటం గమనార్హం! (మళ్లీ పసిడి, వెండి.. మెరుపులు)

అంచనాలు ఇలా..
పసిడి ధరలపై సాంకేతికంగా చూస్తే ఇలియట్‌ వేవ్‌ విశ్లేషణ ప్రకారం గత నాలుగేళ్లలో రూ. 25,000-56,000 మధ్య 5 వేవ్స్‌ పూర్తయ్యాయి. దీంతో సమీప భవిష్యత్‌లో కరెక్షన్‌కు చాన్స్‌ ఉన్నట్లు సాంకేతిక నిపుణులు తెలియజేశారు. తద్వారా కొంతకాలం కన్సాలిడేషన్‌ జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. రూ. 54,000 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఇక మరోవైపు రూ. 48,500, 46,000, 44,300 వద్ద సపోర్ట్స్‌ కనిపించవచ్చని ఊహిస్తున్నారు. వెరసి 2021లో పసిడి సగటున 40,000- 50,000 శ్రేణిలో సంచరించవచ్చని అంచనా వేస్తున్నారు.

ఆగస్ట్‌లో రికార్డ్‌
కోవిడ్‌-19 భయాలతో న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 2,067 డాలర్ల వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో దేశీయంగానూ ఆగస్ట్‌లో పసిడి 10 గ్రాములు ఎంసీఎక్స్‌లో రూ. 57,100కు ఎగసింది. ఇది బులియన్‌ చరిత్రలోనే అత్యధికంకాగా.. తదుపరి ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడం, వ్యాక్సిన్లపై ఆశలు కారణంగా పసిడి వెనకడుగు వేస్తూ వచ్చింది. ప్రస్తుతం కామెక్స్‌లో 1,885 డాలర్లకు చేరింది. ఇక ఎంసీఎక్స్‌లోనూ రూ. 50,300కు దిగింది. అయినప్పటికీ 2020లో పసిడి 35 శాతంపైగా ర్యాలీ చేయడం గమనార్హం! వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ వివరాల ప్రకారం 2019లో పసిడి 1,393 డాలర్ల సమీపంలో నిలిచింది. దేశీయంగా రూ. 38,200 స్థాయిలో ముగిసింది. కాగా.. క్రెడిట్‌ స్వీస్‌ అంచనాల ప్రకారం 2021లో గరిష్టంగా 2,100 డాలర్ల సమీపానికి బలపడవచ్చు. ఇది 11 శాతం వృద్ధి. 

మరిన్ని వార్తలు