అటూఇటుగా బంగారం- వెండి ధరలు

4 Sep, 2020 09:55 IST|Sakshi

లాభనష్టాల మధ్య ఊగిసలాట..

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 50,900కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 66,860 వద్ద ట్రేడింగ్‌

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1943 డాలర్లకు

26.85 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి ధర

మూడు రోజులుగా ఊగిసలాట మధ్య వెనకడుగు వేస్తూ వస్తున్న పసిడి ధరలు ప్రస్తుతం స్వల్పంగా పుంజుకున్నాయి. మరోపక్క తీవ్ర ఆటుపోట్ల మధ్య వెండి ధరలు నామమాత్రంగా బలహీనపడ్డాయి. వెరసి వరుసగా మూడో రోజూ నేలచూపులతో కదులుతున్నాయి. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ అటూఇటుగా కదులుతున్నాయి. వివరాలు ఇలా..  

మిశ్రమ బాట..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 158 లాభపడి రూ. 50,900 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 66 నష్టంతో రూ. 66,860 వద్ద కదులుతోంది.

మూడో రోజూ..
గురువారం వరుసగా మూడో రోజు పసిడి ధరలు వెనకడుగు వేశాయి. వెండి సైతం డీలా పడింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి నామమాత్రంగా రూ. 79 క్షీణించి రూ. 50,742 వద్ద ముగిసింది. తొలుత 51,068 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,500 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,328 పడిపోయి రూ. 66,926 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 68,855 వరకూ బలపడిన వెండి ఒక దశలో రూ. 66,306 వరకూ వెనకడుగు వేసింది. 

కామెక్స్‌లోనూ..
విదేశీ మార్కెట్లో గత మూడు రోజులుగా నేలచూపులతో కదులుతున్న పసిడి ధరలు స్వల్పంగా కోలుకున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 0.3 శాతం బలపడి 1,943 డాలర్లకు చేరింది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.4 శాతం పుంజుకుని 1938 డాలర్ల వద్ద కదులుతోంది. అయితే వెండి మాత్రం ఔన్స్ 0.1 శాతం నీరసించి 26.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్‌ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. పసిడి, వెండి ధరలు రెండు రోజులు బలపడితే.. రెండు రోజులు క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు