గూగుల్‌ ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌.. ఈసారి ఆ భాగ్యం కొందరికే!

8 Mar, 2023 15:19 IST|Sakshi

అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ టెక్‌ కంపెనీలు లేఆఫ్‌లను అమలు చేస్తూ వందలకొద్దీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్ కూడా ఇటీవలి కాలంలో అనేకమంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ప్రమోషన్ల విషయంలోనూ గూగుల్‌ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో కంటే ఈ ఏడాది తక్కువ ప్రమోషన్లు ఉంటాయని ఉద్యోగులకు గూగుల్‌ సమాచారం అందించినట్లు సీఎన్‌బీసీ కథనం పేర్కొంది.


ప్రమోషన్లు కొందరికే...
ప్రమోషన్ల ప్రక్రియ గతంలో మాదిరిగానే మేనేజర్ల నేతృత్వంలో ఉండనుంది. అయితే నియామాలు పెద్దగా చేపట్టకపోవడంతో ఈ ఏడాది ప్రమోషన్లు కూడా తక్కువ సంఖ్యలోనే ఉంటాయని పేర్కొంది. అది కూడా ఎల్‌ 6, ఆపై స్థాయిలోనే ప్రమోషన్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త పనితీరు సమీక్ష వ్యవస్థ ప్రకారం సీనియర్లు, నాయకత్వ స్థాయిలో తగినంతమంది ఉద్యోగులు ఉండాలి. అందుకు అనుగుణంగా ఈ ప్రమోషన్లు ఉంటాయని యాజమాన్యం ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో స్పష్టం చేసినట్లు సమాచారం.

కంపెనీలో​ మధ్య స్థాయిలో పనిచేసే ఉద్యోగులే కీలకం.. ప్రమోషన్లపై వారిలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం కంపెనీ గత ఏడాదే ఒక అంతర్గత సర్వేను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల కోసం మార్చి 6 నుంచి 8 తేదీల మధ్య స్వయంగా నామినేట్ చేసుకోవచ్చని గూగుల్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో పేర్కొంది.

ఆర్థిక సంక్షోభం కారణంగా గూగుల్‌ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ క్రమంలో జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. అయితే తొలగించిన ఉద్యోగులకు స్థానిక చట్టాలకు అనుగుణంగా పరిహారాలను అందిస్తున్నట్లు అప్పట్లో ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు