Factcheck: అలాంటిదేమీ లేదు...దంచుడు దంచుడే!

17 Jun, 2022 12:24 IST|Sakshi

జూలై 1 నుండి సీనియర్ సిటిజన్స్   రైల్వే టికెట్లపై రాయితీ?

ప్రభుత్వం స్పందన

సాక్షి,ముంబై: సీనియర్ సిటిజన్స్‌కు  రైల్వే శాఖ అందించే రాయితీలను తిరిగి ప్రారంభించనున్నట్టు ఒక వార్త సోషల్‌ మీడియాలో  హల్‌ చల్‌ చేస్తోంది. జూలై 1 నుండి సీనియర్ సిటిజన్స్ రాయితీలు  తిరిగి పొందవచ్చు అనేవార్త వైరల్‌ అయింది. అయితే దీనిపై   స్పందించిన ప్రభుత్వం ఇది ఫేక్‌ న్యూస్‌ అంటూ ఈ వార్తలను కొట్టిపారేసింది. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ దివ్యాంగులు, రోగులతోపాటు, కొంతమంది విద్యార్థులకు మాత్రమే రాయితీలు ఇస్తోందని పునరుద్ఘాటించింది. 

అలాగే రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ  ప్రెస్‌ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పీఐబీ“ఫ్యాక్ట్ చెక్” హ్యాండిల్ ట్వీట్ చేసింది. దీంతో ఇక నైనా తమకు చార్జీల భారంనుంచి ఉపశమనం లభిస్తుందని ఆశించిన వయో వృద్ధులకు తీరని నిరాశే మిగిలింది. త్వరలోనే రాయితీ తిరిగి లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

కాగా కోవిడ్-19 సంక్షోభ సమయంలో రైళ్లలో సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్న ఛార్జీల రాయితీని భారతీయ రైల్వే తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనాకి ముందు  రైల్వేలో  ప్రత్యేక రాయితీల ద్వారా 58 ఏళ్లు పైబడిన స్త్రీలకు టిక్కెట్టు ధరలో 50 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులు, థర్డ్‌ జెండర్‌ ప్యాసెంజర్లకు 40 శాతం రాయితీ అమలయ్యేది. అయితే తొలి విడత లాక్‌డౌన్‌ నుంచి ఈ రాయితీలు ఏవీ అమలు కావడం లేదు. గడిచిన రెండేళ్లలో సీనియర్‌ సిటిజన్లకు కనుక రాయితీని అమలు చేసి ఉంటే రైల్వేశాఖ ఖజానాలో రూ.3464 కోట్ల రూపాయలు, ఇందులో కనీసం రూ. 1500 కోట్ల​ రాయితీగా వృద్ధులకు అక్కరకు వచ్చేదని ఇటీవలి ఆర్టీఐ సమాచారం ద్వారా వెల్లడైంది.

అలాగే కరోనా  కారణంగా 2020 మార్చిలో  వయోవృద్ధుల రాయితీలను తొలగించిన మంత్రిత్వ శాఖకు వాటిని  పునరుద్ధరించే  ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఏడాది మార్చిలో పార్లమెంటుకు తెలియజేశారు.

మరిన్ని వార్తలు