ట్రాయ్‌ చైర్మన్‌గా వఘేలా

29 Sep, 2020 06:02 IST|Sakshi

న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ కొత్త చైర్మన్‌గా సీనియర్‌ బ్యూరోక్రాట్‌ పి.డి. వఘేలా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం మూడేళ్ల పాటు లేదా ఆయనకు 65 ఏళ్లు వచ్చే దాకా (ఏది ముందైతే అది) ఉంటుంది. ప్రస్తుత చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ పదవీకాలం సెప్టెంబర్‌ 30తో తీరిపోనుంది. గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన వఘేలా ప్రస్తుతం ఫార్మా విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) అమల్లోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో వఘేలా కూడా ఉన్నారు. మరోవైపు, టెలికం రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పదవీ విరమణ చేయనున్న శర్మ తెలిపారు. సర్వీసులకు గట్టి డిమాండ్‌తో పాటు కొత్త మార్పులకు అనుగుణంగా సర్దుకుపోగలిగే సామర్థ్యం టెల్కోలకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు