ఐకానిక్‌ అశోక్‌ హోటల్‌@ రూ.7,409 కోట్లు

25 Nov, 2022 10:50 IST|Sakshi

సంకేత విలువ ఖరారు చేసిన ప్రభుత్వం 

న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సుప్రసిద్ధ సంస్థ అశోక్‌ హోటల్‌ అంచనా విలువను ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఆస్తుల మానిటైజేషన్‌లో భాగంగా ఢిల్లీలోని కీలక ప్రాంతంలోగల అశోక్‌ హోటల్‌కు రూ. 7,049 కోట్ల సంకేత విలువను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 25 ఎకరాలలో విస్తరించిన ఈ ఆస్తి విక్రయాన్ని పబ్లిక్, ప్రయివేట్‌ భాగస్వామ్యం(పీపీపీ)లో చేపట్టనుంది. పెట్టుబడిదారులతో చర్చలు(ఇన్వెస్టర్‌ కన్సల్టేషన్‌) ఇప్పటికే ప్రారంభంకాగా.. క్యాబినెట్‌ నోట్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గతేడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆస్తుల మానిటైజేషన్‌(ఎన్‌ఎంపీ) జాబితాలో అశోక్‌ హోటల్, సమీపాన గల సామ్రాట్‌సహా టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌కు చెందిన 8 ఆస్తులున్నాయి. 2021 ఆగస్ట్‌లోనే సీతారామన్‌ నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్ల విలువైన ఎన్‌ఎంపీ కార్యాచరణకు తెరతీసిన సంగతి తెలిసిందే. తద్వారా విభిన్న మౌలిక రంగ ఆస్తుల విలువను అన్‌లాక్‌ చేసేందుకు నిర్ణయించారు.  

ప్రస్తుతం రూ. 33,422 కోట్లు 
మౌలిక సంబంధ శాఖలతో చర్చల ద్వారా నీతి ఆయోగ్‌ ఎన్‌ఎంపీ నివేదికను రూపొందించింది. ఈ నెల 14న నీతి ఆయోగ్‌ సీఈవో పరమేశ్వరన్‌ అయ్యర్‌తో సమావేశంలో ఆర్థిక మంత్రి ఎన్‌ఎంపీ పురోగతిపై సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం రూ. 33,422 కోట్ల విలువైన ఎన్‌ఎంపీని సాధించింది. 2021-22లో ప్రభుత్వం రూ. లక్ష కోట్ల లావాదేవీలు పూర్తిచేయడం ద్వారా తొలి ఏడాది లక్ష్యం రూ. 88,000 కోట్లను అధిగమించడం గమనార్హం!

మరిన్ని వార్తలు