GST Meet Highlights: జీఎస్‌టీ సమావేశం, కీలక నిర్ణయాలు వాయిదా!

30 Jun, 2022 07:47 IST|Sakshi

చండీగఢ్‌: వస్తు విలువ నిర్ణయానికి సంబంధించిన పక్రియలో (వ్యాలూ చైన్‌) అసమర్థతలను తొలగించడం, ద్రవ్యోల్బణం కట్టడి ప్రధాన లక్ష్యంగానే రేట్ల హేతుబద్దీకరణ, పెంపుదల నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణంపై రేట్ల హేతుబద్ధీకరణ ప్రభావం గురించి అన్ని రాష్ట్రాలకు తెలుసని ఆమె అన్నారు. 

పన్ను రేట్లలో పెరుగుదల ఇందుకు సంబంధించిన భారాన్ని కూడా భర్తీ చేసే విధంగా ఉందని, వ్యాల్యూ చైన్‌లోని కొన్ని ఇతర కార్యకలాపాల ద్వారా ఈ మేరకు ఫలితాలు ఒనగూరుతాయని ఆమె భరోసాను ఇచ్చారు. సాంకేతికత ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని కూడా పేర్కొన్నారు. పెరిగిన రేట్లు జూలై 18వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఆగస్టు మొదటివారంలో మండటి తదుపరి సమావేశం నిర్వహించనుంది.  

జూలై 15లోపు మంత్రుల బృందం నివేదిక 
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన చండీగఢ్‌లో రెండు రోజుల పాటు జరిగిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అత్యున్నత స్థాయి నిర్ణయక మండలి 47వ సమావేశం బుధవారం ముగిసింది. మాంసం, చేపలు, పెరుగు, పనీర్, తేనె వంటి ఆహార పదార్థాల విషయంలో ముందే ప్యాక్‌ లేదా లేబుల్‌ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్‌టీ విధింపుసహా తొలి రోజు పలు నిర్ణయాలను తీసుకున్న మండలి సమావేశం రెండరోజు కీలక అంశాలపై తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది.  

జీఎస్‌టీ స్లాబ్స్‌లో మార్పులు, రెవెన్యూ నష్టానికి సంబంధించి రాష్ట్రాలకు పరిహారం (జూన్‌లో ముగిసే ఐదేళ్ల కాలం తరువాత)సహా ఆన్‌లైన్‌ గేమింగ్, రేసింగ్‌లు, క్యాసినో, లాటరీలపై 28 శాతం పన్ను విధింపు వంటి కీలక అంశాలపై సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. కీలక అంశాలపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులకోసం ఆయా అంశాలను వాయిదా వేసినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ‘ఈరోజు జరిగిన సమావేశంలో 16 రాష్ట్రాలు జీఎస్‌టీ పరిహారంపై మాట్లాడాయి. ఇందులో 3-4 రాష్ట్రాలు పరిహారంపై ఆధారపడకుండా తమంతట తాముగా నిలబడతామని అన్నాయి’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.

దాదాపు 12 రాష్ట్రాలు జూన్‌ తర్వాత పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఇక  వాల్యుయేషన్‌ యంత్రాంగం (వ్యాల్యూ చైన్‌), కీలక విభాగాలపై పన్నుల విధింపుపై  మళ్లీ సంబంధిత వర్గాలతో చర్చించి, జూలై 15వ తేదీలోపు నివేదిక సమర్పించాలని  మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందాన్ని కోరినట్లు ఆర్థికమంత్రి తెలిపారు.

కీలక పన్ను సంస్కరణకు ఐదేళ్లు... 
పరోక్ష పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ, 2017 జూలై 1వ తేదీ నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అడ్డంకులను తగ్గించడం ద్వారా జీఎస్‌టీ విధానం వ్యాపారాన్ని సులభతరం చేసిందని 90 శాతం మంది భారత్‌ పారిశ్రామిక ప్రతినిధులు భావిస్తున్నారని డెలాయిట్‌ సర్వే ఇటీవల తెలిపింది. 

జీఎస్‌టీ విధానం అంతిమ వినియోగదారులకు సంబంధించి వస్తువులు, సేవల ధరల ప్రక్రియను సానుకూలం చేసిందని తెలిపింది. తమ సరఫరా చైన్లను పటిష్టం చేసుకోవడంలో కంపెనీలకు సైతం పరోక్ష పన్నుల విధానం దోహదపడుతోందని  ‘జీఎస్‌టీ : 5 సర్వే 2022’ పేరుతో తాము జరిపిన ఈ సర్వేలో వెల్లడైనట్లు వివరించింది. ప్రస్తుతం జీఎస్‌టీ కింద నాలుగు శ్లాబ్‌లు అమలు జరుగుతున్నాయి. నిత్యావసరాలపై 5 శాతం పన్ను రేటు మొదటిది. కార్లు, డీమెరిట్, లగ్జరీ, సిన్‌ గూడ్స్‌పై 28 శాతం అత్యధిక రేటు అమలవుతోంది. మధ్యస్థంగా 12, 18 శాతం రేట్లు అమలవుతున్నాయి.

మరిన్ని వార్తలు