ఏప్రిల్‌లో జీఎస్టీ రికార్డుల మోత

2 May, 2021 02:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత ఎన్నడూ లేనంత అధికంగా ఏప్రిల్‌ నెలలో మొత్తం రూ. 1,41,384 కోట్ల వసూళ్లు జరిగాయి. అయితే మార్చిలో 1.24 లక్షల కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన జీఎస్టీ డేటాను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.27,837 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.35,621 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ ఐజీఎస్‌టీ కింద రూ.68,481 కోట్లు వసూలు అయ్యాయి. కాగా రూ .9,445 కోట్లు సెస్‌ రూపంలో వసూలు చేశారు.

మార్చిలో వసూలైన రూ.1.24 లక్షల కోట్లతో పోలిస్తే ఏప్రిల్‌లో జీఎస్టీ వసూలు 14% ఎక్కువగా జరిగింది. వాస్తవానికి, ఏప్రిల్‌లో పాక్షిక లాక్‌డౌన్‌తో, జీఎస్టీ తగ్గుతుందని కేంద్రం ఊహించింది. ఏప్రిల్‌ నెలలో జీఎస్టీ వసూలు 1.15 నుంచి 1.20 లక్షల కోట్ల రూపాయల మధ్య ఉండవచ్చని శుక్రవారం ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌తో ఎక్కువగా ప్రభావితమైన మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సాధారణంగా జీఎస్టీ వసూలు ఎక్కువగా ఉంటుంది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు