యూజర్ల డేటాను ఇతర సంస్థలకు అందిస్తోన్న ట్రూకాలర్‌..!

7 Jul, 2021 20:50 IST|Sakshi

ట్రూకాలర్‌పై బాంబే హైకోర్టులో పిల్‌ దాఖలు

నిబంధనలను ఉల్లఘించి ఇతర సంస్థలతో డేటా షేరింగ్‌

కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ

ముంబై: ట్రూకాలర్ మొబైల్ అప్లికేషన్ దేశంలోని చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించి యూజర్ డేటాను ఇతర సంస్థలో పంచుకుందని పేర్కొంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బాంబే హైకోర్టు బుధవారం కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. శశాంక్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంలో..ట్రూకాలర్ యాప్‌ వినియోగదారులందరి డేటాను సేకరించి, వారి అనుమతి లేకుండా ఇతర భాగస్వాములతో  వినియోగదారుల డేటాను పంచుకుంటుందని పేర్కొన్నాడు. ఈ వ్యాజ్యాన్ని ఛీఫ్‌ జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ జీ ఎస్‌ కులకర్ణితో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.  

యూజర్ల డేటా వారికి తెలియకుండా..
యూజర్లకు  వేరే యాప్‌ అందుబాటులో లేకపోవడంతో ట్రూకాలర్‌ ఆటలు సాగుతున్నాయని పేర్కొన్నాడు. ట్రూకాలర్‌ యూజర్ల డేటాను వారికి తెలియకుండా గూగుల్ ఇండియా, భారతి ఎయిర్‌ టెల్‌, ఐసిఐసిఐ బ్యాంక్, అనేక రుణాలు అందించే సంస్థలకు అందిస్తున్నాయని పిటిషనర్‌ కోర్టుకు తెలిపాడు. ఈ కేసులో కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్ర ఐటి విభాగం, ట్రూకాలర్ ఇంటర్నేషనల్ ఎల్‌ఎల్‌పి, ఐసిఐసిఐ బ్యాంక్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్‌ను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ పేర్కొన్నాడు. ట్రూకాలర్‌ యాప్‌ యూజర్ల అనుమతి లేకుండానే యూపిఐ సేవలను అందిస్తోందని పిటిషనర్‌ ఆరోపించారు.

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం..!
ప్రభుత్వ అధికారులు ట్రూకాలర్ యాప్‌ను సరైన తనిఖీలు లేకుండా ఆమోదించారని ఆరోపించారు. ట్రూకాలర్ తన మొబైల్ అప్లికేషన్ ద్వారా పౌరుల డేటా గోప్యతను పూర్తిగా ఉల్లంఘించిందని కోర్టుకు విన్నవించాడు. అంతేకాకుంగా యాప్‌ డేటా రక్షణ చట్టాలను పూర్తిగా అతిక్రమిస్తోందని పేర్కొన్నాడు. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు మూడువారాల్లోపు సమాధానమివ్వాలని సూచించింది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు