ఐటీ డిమాండు నోటీసు వచ్చిందా..

31 May, 2021 13:58 IST|Sakshi

ప్రస్తుతం 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అసెస్‌మెంట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి డిమాండు నోటీసులైనా రావచ్చు.. రిఫండైనా రావచ్చు. మీరు వేసిన రిటర్నులోని అన్ని అంశాలతో డిపార్ట్‌మెంటు ఏకీభవించవచ్చు.. ఏకీభవించకపోవచ్చు. ఈ నేపథ్యంలో డిమాండు నోటీసు గురించి ఈ వారం తెలుసుకుందాం.

గత వారం చెప్పినట్లు మీరే స్వయంగా వారానికోసారి ఇన్‌కం ట్యాక్స్‌ వెబ్‌సైట్లోకి లాగిన్‌ అవ్వండి. E– Fileలోకి వెళ్లండి. ‘డిమాండ్‌’ అన్న కాలంని క్లిక్‌ చేయండి. తర్వాత ‘ View’ని క్లిక్‌ చేయండి. మీ అసెస్‌మెంట్‌ వివరాలు కనిపిస్తాయి. 

ఏయే సందర్భాల్లో రావచ్చు.. 

 • మీరు డిక్లేర్‌ చేసిన ఆదాయంతో డిపార్టుమెంటు ఏకీభవించకుండా, ఎక్కువ అసెస్‌ చేస్తే.. 
 • వ్యాపారస్తుల విషయంలో కొన్ని ఖర్చులను ఒప్పుకోకపోతే.. 
 • మీరు క్లెయిమ్‌ చేసిన ‘డిడక్షన్‌’ తప్పయితే.. 
 • మీకు అర్హత లేని లేదా వర్తించని డిడక్షన్లను క్లెయిమ్‌ చేస్తే 
 • తప్పులు దొర్లితే 
 • చెల్లించిన పన్ను వివరాలు.. టీడీఎస్, అడ్వాన్స్‌ ట్యాక్స్, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ మొదలైన వాటి విషయంలో అప్‌డేట్‌ అయిన వివరాలతో సరిపోలకపోతే 
 • రిటర్నుల్లో వివరాలు సరిగ్గా, సమగ్రంగా పొందుపర్చకపోతే 
 • ఆదాయం,పన్ను చెల్లింపులు, చెల్లించవలసిన మొత్తం వంటి వివరాల్లో హెచ్చుతగ్గులు ఉంటే నోటీసు రాగానే ఏం చేయాలి.. 
 • గాభరాపడనక్కర్లేదు. ఆ నోటీసులో ప్రతీ అంశాన్ని చదవండి. 
 • వాళ్లే ఒక కాలంలో మీరు డిక్లేర్‌ చేసింది, ఆ పక్కన ఇంకో కాలంలో వారు అసెస్‌ చేసినది చూపిస్తారు. 
 • ఈ రెండింటినీ సరిపోల్చి చూసుకోండి. 
 • వారి డిమాండ్‌ కరెక్ట్‌ అయితే ఆ విషయం ఒప్పుకుని డిమాండు మొత్తాన్ని చెల్లించండి. 
 • ఒకవేళ వారితో ఏకీభవించకపోతే ఒప్పుకోకండి. ‘disagree’ అని క్లిక్‌ చేయండి. సరయిన వివరణ, జరిగిన తప్పులను సరిదిద్దడం, పూర్తి వివరాలను పొందుపర్చటం వంటివి చేయండి. 
 • ఒక్కొక్కప్పుడు కొంత తప్పే మీది కావచ్చు..ఇంకొంత తప్పు వారిది కావచ్చు. డిమాండు కొంతవరకే నిజం కావచ్చు. అంటే పాక్షికంగా అన్నమాట. అలాగే బదులివ్వండి. పూర్తి వివరాలతో సరైన వివరణ ఇవ్వండి. 
 • కాగితాలు, రుజువులు, ఆధారాలు అడిగితే జతపర్చండి. 
 • ఇలా చేస్తే మీ ఆదాయపు పన్నుఅసెస్‌మెంటు పూర్తయినట్లే. నోటీసుకి బదులివ్వడం వలన మీ బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా మీ అసెస్‌మెంటు అంశానికి సంబంధించిన కథకు కూడా సుఖాంతం పలికినట్లవుతుంది.

ట్యాక్సేషన్‌ నిపుణులు
కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు