అత్యధిక  ‘ఆతిథ్య’ బుకింగ్స్‌ జాబితాలో హైదరాబాద్‌

9 Feb, 2023 20:05 IST|Sakshi

ఆఫ్‌ బీట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌లలో మాదాపూర్‌

సాక్షి, హైదరాబాద్‌:  దేశవ్యాప్తంగా పర్యాటకుల ఆసక్తిని దక్కించుకున్న అగ్రగామి ఆతిథ్య నగరాల్లో హైదరాబాద్‌ టాప్‌ 5గా నిలిచింది. ఈ విషయాన్ని పర్యాటకులకు హోమ్‌స్టేస్‌ అందించే ఆన్‌లైన్‌ వేదిక ఎయిర్‌ బిఎన్‌బి అధ్యయనం వెల్లడించింది. పర్యాటకాభిరుచుల గురించి గత ఏడాదికి సంబంధించి ఈ సంస్థ అధ్యయనం వెల్లడించిన పలు ఆసక్తికరమైన విశేషాల్లో...

సోలో టూర్‌... సో బెటరూ...
ఒంటరిగా ప్రయాణించడాన్ని అత్య«ధిక శాతం మంది ఇష్టపడుతున్నారని స్టడీ తేల్చింది. పర్యాటకశైలి ఆసక్తుల్లో సోలో ట్రావెల్‌  అత్యంత ప్రజాదరణ పొందిన అంతర్జాతీయ ప్రయాణ శైలిగా నిలవగా, తర్వాత స్థానాల్లో  జంటగా చేసే కపుల్‌ ట్రావెల్, ఆ తర్వాత కుటుంబతో కలిసి చేసే ఫ్యామిలీ ట్రావెల్‌ లు ఉన్నాయి. 

మాదాపూర్‌ కు...ఆఫ్‌ బీట్‌ జర్నీ...
అంతగా ప్రాచుర్యంలో లేని ప్రాంతాలను (ఆఫ్‌–ది–బీటెన్‌–పాత్‌ ) పర్యాటకులు అన్వేషించడం పెరిగింది. దేశీయంగా తమిళనాడు, మహారాష్ట్ర, మేఘాలయ, తెలంగాణ  రాష్ట్రాల్లో ఆఫ్‌–బీట్‌ గమ్యస్థానాలను టూరిస్ట్‌లు అన్వేషిస్తున్నారు అలా ప్రచారంలో లేని పర్యాటకస్థలాలకు వీరు ప్రయాణించడం ఆయా ప్రాంతాలకు ప్రయోజనంతో పాటు  పర్యాటకరంగ పురోభవృద్ధికి దోహదం చేస్తోంది. దేశంలోనే టాప్‌ 5 ఆఫ్‌–ది–బీట్‌–పాత్‌ ట్రెండింగ్‌ గమ్యస్థానాలుగా నగరంలోని మాదాపూర్‌ తొలి స్థానంలో నిలవడం విశేషం ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడులోని  రామేశ్వరం, వెల్లూరు, మేఘాలయలోని చిరపుంజి, మహారాష్ట్ర చించ్వాడ్‌లోని ఫింప్రిలు ఉన్నాయి. 

టాప్‌ సిటీస్‌కూ...సై
అంతర్జాతీయ ప్రయాణం గత ఏడాది వేగవంతమైన  పునరుద్ధరణను సాధించింది, ఈ పెరుగుదల ట్రెండ్‌ 2023లో కూడా కొనసాగనుంది  భారతీయ పర్యాటకులు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నగరాల కోసం అన్వేషిస్తున్నారు.  భారతీయ అతిథులు  అత్యధికంగా శోధించిన అంతర్జాతీయ గమ్యస్థానాలలో వరుసగా దుబాయ్‌. లండన్‌. పారిస్‌. టొరంటో, న్యూయార్క్‌ లు ఉన్నాయి. 

ఆతిథ్యంలో ఢిల్లీ టాప్‌...
చక్కని ఆతిథ్యం విషయానికి వస్తే  అత్యధిక 5–స్టార్‌ రేటింగ్స్‌తో ఢిల్లీ, గోవా, కేరళ, మహారాష్ట్ర  హిమాచల్‌ ప్రదేశ్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. అతిథులు నగర జీవితాన్ని ఆస్వాదించడానికి  ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై  కోల్‌కతాలను ఎక్కువగా  ఎంచుకున్నారని అధ్యయనం వెల్లడించింది. అలాగే తాము బస చేసే చోట ఈత కొలను పక్కన ఆసీనులవడం  లేదా ఇసుక బీచ్‌లో కిరణాలతో స్నానించడం వంటి ఆసక్తులు ఎక్కువగా ప్రదర్శించారు. 

బుకింగ్స్‌లో హైదరాబాద్‌కు 5వ స్థానం..
 గత ఏడాది అత్యధిక బుకింగ్‌లతో భారతదేశంలోని టాప్‌ 5 ఆతిధ్య నగరాలుగా ముంబై (మహారాష్ట్ర), న్యూఢిల్లీ (ఢిల్లీ), గౌహతి (అస్సాం), గోవా  (హైదరాబాద్‌) నిలిచాయి. ఒకే ఏడాది అత్యధికంగా ప్రయాణించిన భారతీయ అతిథిగా 115 కంటే ఎక్కువ బుకింగ్‌లు చేసిన ఓ పర్యాటకుడు నిలిచాడు.

మరిన్ని వార్తలు