ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!

5 Feb, 2022 17:31 IST|Sakshi

ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివిధ సేవల ఛార్జీలను పెంచినట్లు పేర్కొంది. ఇందులో ఆలస్య రుసుముకు సంబంధించిన ఫీజులు ఉన్నాయి. కొత్తగా పెంచిన ఛార్జీలు ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. క్రెడిట్ కార్డుల చార్జీల పెంపు గురించి సందేశాలను వినియోగదారులకు పంపినట్లు తెలిపింది.

ఇక నుంచి క్రెడిట్‌ కార్డు వినియోగించి ఏటీఎం కేంద్రాల వద్ద నగదు తీసినా, ఆలస్యంగా బిల్లులు చెల్లించినా వినియోగదారులపై భారీగా భారం పడనుంది. ఫిబ్రవరి 10, 2022 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఖాతాదారులు నగదు అడ్వాన్స్ లావాదేవీల మీద ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే చెక్‌ రిటర్న్‌ అయినా, ఆటో డెబిట్‌ ఫెయిల్‌ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం ఇకపై వసూలు చేస్తారు. కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి లావాదేవీ చేసే వారు ఇకపై భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తీసిన మొత్తంపై అన్ని కార్డులపై 2.50 శాతం చొప్పున ఫీజుగా వసూలు చేయనున్నారు.

రూ.50వేలు పైన ఎంత మొత్తమైనా గరిష్టంగా రూ.1200 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చార్జీలతో పాటు అదనంగా మరో రూ.50+ జీఎస్టీ చెల్లించాలని ఐసీఐసీఐ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్‌ క్రెడిట్‌ కార్డులకు ఈ ఆలస్య రుసుము ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది. అయితే, సకాలంలో బిల్లులను చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలూ ఉండవు. ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తే ఈఎమ్ఐ మార్చుకోవడం లేదా రుణం తీసుకొని చెల్లిస్తే మంచిది అని నిపుణులు అంటున్నారు.

(చదవండి: లగ్జరీ గృహాలకు ఫుల్‌ డిమాండ్‌! కారణాలు ఇవే..!)

మరిన్ని వార్తలు