కోవిడ్‌ ముందస్తు స్థాయికి నియామకాలు

31 Aug, 2021 08:29 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో నియామకాలు కోవిడ్‌–19 ముందస్తు స్థాయికి చేరుకున్నాయని జాబ్‌ సైట్‌ ఇండీడ్‌ వెల్లడించింది. ఉద్యోగ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని వివరించింది. ‘నియామకాలు 2020 ఫిబ్రవరి స్థాయికి చేరుకున్నాయి. 

గతేడాదితో పోలిస్తే జూలైలో ఐటీ టెక్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం ప్రకటనలు 19 శాతం అధికమయ్యాయి. ప్రాజెక్ట్‌ హెడ్, ఇంజనీర్‌ వంటి ఇతర ఐటీ ఉద్యోగాలకు ప్రకటనలు 8–16 శాతం పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమవడం, కోవిడ్‌ –19 సవాళ్ల చుట్టూ పనిచేయడానికి వ్యాపార సంస్థలు చేసే ప్రయత్నాలు భారతీయ జాబ్‌ మార్కెట్‌ను రికవరీ వైపు నెట్టా యని ఇండీడ్‌ ఇండియా సేల్స్‌ హెడ్‌ శశి కుమార్‌ తెలిపారు. టెక్‌ జాబ్స్‌ జోరు ఎక్కువగా కొనసాగుతున్నప్పటికీ, రిటైల్, ఫుడ్‌ రంగంలో తిరిగి డిమాం డ్‌ రావడం వృద్ధిని మరింతగా పెంచడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ కీలకంగా  ఉందన్నారు. 

ప్రాధాన్యతలలో మార్పు..
 
కంపెనీలు, ఉద్యోగార్ధులకు పరిశుభ్రత ప్రధాన ప్రాధాన్యతగా మారింది. హౌజ్‌కీపర్స్, కేర్‌టేకర్స్, క్లీనర్స్‌ ఉద్యోగాలు 60 శాతం దూసుకెళ్లాయి. వెటెరినరీ, థెరపీ, పర్సనల్‌ కేర్, చైల్డ్‌ కేర్‌ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది. ఉద్యోగార్ధుల ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పును సూచించే ధోరణి ఇది. 

అభ్యర్థుల్లో ఆసక్తి విషయంలో విమానయానం 25 శాతం, అకౌంటింగ్‌ 8, కస్టమర్‌ రిలేషన్స్‌ 7, అడ్మిన్‌ 6 శాతం తగ్గాయి. ఉద్యోగ వృద్ధి వేగవంతం అవుతూనే ఉంది. ఎక్కువ మంది కార్మికులు ఉద్యోగాలు వెతుకుతున్నారు. కార్మిక మార్కెట్‌ పునర్‌ ప్రారంభంతో ముడిపడి ఉన్న రంగాలు ముందంజలో ఉన్నాయి’ అని ఇండీడ్‌ వివరించింది. ఈ ట్రెండ్‌ రాబోయే నెలల్లో కొనసాగవచ్చన్న ఆశను కలిగిస్తున్నాయని టాలెంట్‌ అక్విజిషన్‌ అనలిస్ట్‌ రేచల్‌ స్టెల్లా రాజ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు