బంగారం డిమాండ్‌ 70% డౌన్‌

31 Jul, 2020 04:58 IST|Sakshi

డబ్ల్యూజీసీ ఏప్రిల్‌–జూన్‌ గణాంకాలు

లాక్‌డౌన్, అధిక ధరల ప్రతికూలత

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల జోరు

ముంబై: భారత్‌ పసిడి డిమాండ్‌ ఏప్రిల్‌–జూన్‌ మధ్య 70 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక పేర్కొంది. కోవిడ్‌–19 నేపథ్యంలో మార్చి 25 నుంచి విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం, అధిక ధరల వంటి అంశాలు డిమాండ్‌ భారీ పతనానికి కారణమని వివరించింది. ‘క్యూ2 పసిడి డిమాండ్‌ ట్రెండ్స్‌’  పేరుతో విడుదలైన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► 2019 రెండవ త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో పసిడి డిమాండ్‌ 213.2 టన్నులు. ఈ పరిమాణం 2020 ఇదే నెలల మధ్య 63.7 టన్నులకు పరిమితమైంది.  

► ఇక డిమాండ్‌ విలువ విషయానికి వస్తే, 57 శాతం పతనమై రూ.62,420 కోట్ల నుంచి రూ.26,600 కోట్లకు క్షీణించింది.  

► ఆభరణాల డిమాండ్‌ పరిమాణంలో 74 శాతం తగ్గి 168.6 టన్నుల నుంచి 44 టన్నులకు పడింది. విలువలో చూస్తే, 63 శాతం పడిపోయి, రూ.49,380 కోట్ల నుంచి రూ. 18,350 కోట్లకు చేరింది.  పెళ్లిళ్లు జరక్కపోవడం, భవిష్యత్తుపై అనిశ్చితి వాతావరణం వంటి అంశాలు దీనికి కారణం.  

► ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, పరిమాణం డిమాండ్‌ 56 శాతం క్షీణించి 44.5 టన్నుల నుంచి 19.8 టన్నులకు జారింది. విలువల్లో 37 శాతం క్షీణించి 13,040 కోట్ల నుంచి రూ.8,250 కోట్లకు చేరింది.  

► పసిడి రీసైకిల్డ్‌ పరిమాణం కూడా 64 శాతం క్షీణతతో 37.9 టన్నుల నుంచి 13.8 టన్నులకు దిగివచ్చింది. నేషనల్‌ లాక్‌డౌన్‌తో రిఫైనరీలు మూతపడ్డం దీనికి ప్రధాన కారణం.  

► పసిడి దిగుమతులు భారీగా 95 శాతం క్షీణించి 247.4 టన్నుల నుంచి కేవలం 11.6 టన్నులకు పరిమితం.

► కాగా 2020 మొదటి ఆరునెలల్లో భారత్‌ పసిడి డిమాండ్‌ 56 శాతం పతనమై 165.6 టన్నులకు క్షీణించింది.

పెట్టుబడులు అదుర్స్‌...
పసిడి అంతర్జాతీయంగా డిమాండ్‌ సైతం ఏప్రిల్‌–జూన్‌ మధ్య 11 శాతం పడిపోయింది. 2019 ఇదే కాలంలో పోల్చి చూస్తే డిమాండ్‌ 1,136.9 టన్నుల నుంచి 1,015.7 టన్నులకు క్షీణించినట్లు డబ్ల్యూజీసీ తాజా నివేదిక పేర్కొంది.  అయితే పెట్టుబడులకు సంబంధించి డిమాండ్‌ మాత్రం భారీగా పెరగడం గమనార్హం.

జీవితకాల గరిష్ట స్థాయిల్లో ధర...
మరోవైపు పసిడి ధరలు అంతర్జాతీయంగా జీవితకాల గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వారం మొదట్లో సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌ (నైమెక్స్‌)లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్‌ ఔన్స్‌ (31.1 గ్రా) ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్‌ చేసిన తర్వాత తిరిగి అంతకన్న కిందకు దిగిరాలేదు.

అటు తర్వాత రెండు రోజుల్లో 1,974.7 డాలర్లకు చేరి సరికొత్త రికార్డును సృష్టించిన ధర గురువారం  1,936–1,965 డాలర్ల శ్రేణిలో ఉంది.  ఇక భారత్‌ విషయానికి వస్తే, అంతర్జాతీయ దూకుడు ధోరణికితోడు రూపాయి బలహీన ధోరణి (ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో గురువారం డాలర్‌ మారకంలో ముగింపు 74.84) పసిడికి వరంగా మారుతోంది.  స్పాట్‌ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.53,000– రూ.54,000 మధ్య తిరుగుతుండగా, ఆభర ణాల బంగారం రూ.50,000పైనే ట్రేడవుతోంది.

>
మరిన్ని వార్తలు