జూన్‌ త్రైమాసికంలో క్యాడ్‌ 2.8 శాతం

30 Sep, 2022 06:07 IST|Sakshi

ముంబై: భారత్‌ కరెంట్‌ అకౌంట్‌లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 2.8 శాతం (జీడీపీ విలువలో)గా నమోదయ్యింది. విలువలో ఇది 23.9 బిలియన్‌ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కరెంట్‌ అకౌంట్‌ 6.6 బిలియన్‌ డాలర్ల (జీడీపీలో 0.9 శాతం) మిగుల్లో ఉండడం గమనార్హం. ఆర్‌బీఐ తాజా గణాంకాలను విడుదల చేసింది. 

2022 జనవరి–మార్చి త్రైమాసికంలో క్యాడ్‌ 13.4 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 1.5 శాతం). ఎగుమతులకన్నా దిగుమతుల పరిమాణం భారీగా పెరుగుతుండడం తాజా సమీక్షా త్రైమాసికంలో కరెంట్‌ అకౌంట్‌ తీవ్రతకు కారణం. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్‌ అకౌంట్‌’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్‌ అకౌంట్‌ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్‌ అకౌంట్‌ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. 

మరిన్ని వార్తలు