స్టార్టప్‌లకు తగ్గిన నిధులు

12 Jan, 2023 10:46 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థల్లోకి పెట్టుబడులు గతేడాది తగ్గాయి. అంతక్రితం ఏడాదితో (2021) పోలిస్తే 2022లో 33 శాతం క్షీణించి 24 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే, 2019, 2020తో పోలిస్తే మాత్రం దాదాపు రెట్టింపయ్యాయి. పీడబ్ల్యూసీ ఇండియా బుధవారం విడుదల చేసిన ’స్టార్టప్‌ ట్రాకర్‌ – సీవై 22’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్టార్టప్స్‌లోకి 2019లో 13.2 బిలియన్‌ డాలర్లు, 2020లో 10.9 బిలియన్‌ డాలర్లు, 2021లో 35.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతర్జాతీయంగా మందగమనం ఉన్నా భారత స్టార్టప్‌ వ్యవస్థపై గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (సాస్‌), ప్రారంభ దశ ఫండింగ్‌ వంటి విభాగాల్లోకి పెట్టుబడులు ఆశావహంగా కనిపిస్తున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ అమిత్‌ నావ్‌కా తెలిపారు. వచ్చే 2–3 త్రైమాసికాల్లో పెట్టుబడుల పరిస్థితి తిరిగి సాధారణ స్థాయికి రావచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అత్యవసరం కాని ఖర్చులు, పెట్టుబడులను వాయిదా వేసుకోవడం ద్వారా తమ నిర్వహణ విధానాలను కట్టుదిట్టం చేసుకునేందుకు, మరికొన్నాళ్ల పాటు నగదు చేతిలో అందుబాటులో ఉండేలా చూసుకునేందుకు స్టార్టప్‌లు ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు.  

ప్రారంభ దశ డీల్స్‌ అత్యధికం.. 
ఒప్పందాల పరిమాణంపరంగా చూస్తే 2021, 2022లో ప్రారంభ దశ పెట్టుబడులకు సంబంధించిన డీల్స్‌ అత్యధికంగా (60–62 శాతం) ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఒక్కో డీల్‌ కింద సగటున 4 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు వివరించింది. గతేడాది విలువపరంగా చూస్తే వచ్చిన మొత్తం నిధుల్లో ప్రారంభ దశ పెట్టుబడుల పరిమాణం 12 శాతంగా (2021లో దాదాపు 7 శాతం) ఉంది.

ఇక 2022లో వృద్ధి, తదుపరి దశ పెట్టుబడుల పరిమాణం 88 శాతంగా ఉంది. 38 శాతం డీల్స్‌ ఈ కోవకి చెందినవి ఉన్నాయి. ఇక నివేదిక ప్రకారం గ్రోత్‌ స్టేజ్‌ డీల్స్‌ సగటు పెట్టుబడి పరిమాణం 43 మిలియన్‌ డాలర్లుగా ఉండగా, తదుపరి దశ ఒప్పందాలకు సంబంధించి 94 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం దేశీ స్టార్టప్స్‌లో అత్యధిక శాతం (82 శాతం) అంకుర సంస్థలు బెంగళూరు, ఎన్‌సీఆర్‌ (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌), ముంబైలో ఉన్నాయి. ఈ టాప్‌ 3 నగరాల్లోని 28 శాతం స్టార్టప్‌లు 20 మిలియన్‌ డాలర్ల పైగా పెట్టుబడులు సమీకరించాయి. బెంగళూరులో అత్యధికంగా యూనికార్న్‌లు (1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌ ఉన్నవి) నమోదయ్యాయి. ఎన్‌సీఆర్, ముంబై నగరాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి!

మరిన్ని వార్తలు