మళ్లీ పరిశ్రమలు మైనస్‌!

13 Mar, 2021 04:50 IST|Sakshi

జనవరిలో క్షీణతలోకి జారిన పారిశ్రామిక ఉత్పత్తి

1.6 శాతం తిరోగమనం...

ఫిబ్రవరిలో పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

5.03 శాతంగా నమోదు  

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి శుక్రవారం వెలువడిన గణాంకాలు నిరాశపరిచాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2021 జనవరిలో 1.6 శాతం క్షీణించింది.  2020 జనవరిలో ఐఐపీ 2.2 శాతం వృద్ధిలో ఉంది. ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరిలో 4.06 శాతం ఉండగా, ఫిబ్రవరిలో 5.03 శాతానికి చేరింది. గడచిన మూడు నెలల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. రిటైల్‌ ద్రవ్యోల్బణం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయి 2–6 శాతం శ్రేణిలోనే ఉన్నప్పటికీ, మూడు నెలల గరిష్టానికి చేరడం ఆందోళన కలిగిస్తున్న అంశం.

ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి రిటైల్‌ ద్రవ్యోల్బణంమే ప్రాతిపదిక కావడం గమనార్హం. తాజా గణాంకాల నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవస్థలో డిమాండ్‌ పెంపునకు మరో విడత రెపో తగ్గింపునకు రిటైల్‌ ద్రవ్యోల్బణం ‘అడ్డంకిగా కొనసాగే’ అవకాశాలు కనిపిస్తున్నాయి.  గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్‌ బ్యాంక్, గడచిన (2020 ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి 2021 నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో ‘ద్రవ్యోల్బణం భయాలతో’ యథాతథ రేటును కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం తీవ్రతకు ఆహార ధరల పెరుగుదల కారణం కావడం మరో కీలకాంశం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే...

కీలక రంగాలు పేలవం
► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.6 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో ఉత్పత్తి 2020 జనవరితో పోల్చితే, 2021 జనవరిలో 2 శాతం క్షీణించింది. 2020 ఇదే నెలలో ఈ విభాగంలో 1.8 శాతం వృద్ధి నమోదయ్యింది.  
► క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు ప్రతిబింబమైన ఈ విభాగంలో క్షీణత భారీగా 9.6 శాతంగా నమోదయ్యింది. 2020 జనవరిలో ఈ క్షీణత 4.4 శాతంగానే ఉంది.  
► కన్జూమర్, నాన్‌ కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: ఈ రెండు విభాగాలూ జనవరిలో క్షీణతను నమోదుచేసుకున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో 0.2 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక సబ్బులు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్, కాస్మెటిక్స్‌ వంటి ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ (నాన్‌ డ్యూరబుల్స్‌) విభాగం ఏకంగా 6.8 శాతం క్షీణతను నమోదుచేసుకోవడం గమనార్హం. 2020 జనవరిలోనూ ఈ రెండు విభాగాలు క్షీణతలోనే ఉన్నాయి.  
►  మైనింగ్‌: 3.7 శాతం మైనస్‌లో ఉంది.  
► విద్యుత్‌: ఈ విభాగంలో మాత్రం 5.5 శాతం ఉత్పత్తి వృద్ధి నమోదయ్యింది.  

కరోనా నేపథ్యంలో...
కోవిడ్‌–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో గత ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకూ ఇదే క్షీణ పరిస్థితి కొనసాగింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్‌ 14, ఏప్రిల్‌ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్‌డౌన్‌ అమలు జరిగిన సంగతి తెలిసిందే.  లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో కూడా 4.2 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్‌ కూడా కలిసి వచ్చింది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 2.1 శాతం క్షీణతలోకి పడిపోయింది. డిసెంబర్‌లో తిరిగి 1.56 శాతం వృద్ధి నమోదుచేసుకున్నా (తొలి అంచనా 1 శాతం నుంచి ఎగువ దిశలో తాజా సవరణ), తిరిగి జనవరిలో క్షీణతలోకి జారిపోయింది.  

ఏప్రిల్‌–జనవరి మధ్య 12.2 శాతం క్షీణత
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్‌ నుంచి జనవరి వరకూ చూస్తే, పారిశ్రామిక ఉత్పత్తి 12.2 శాతంగా ఉంది. 2019–20 ఇదే కాలంలో కనీసం స్వల్పంగానైనా 0.5 శాతం వృద్ధి నమోదయ్యింది.  

ఆహార ధరలు పైపైకి...

రిటైల్‌ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, 2021 ఫిబ్రవరిలో ఫుడ్‌ బాస్కెట్‌కి సంబంధించి ధరల స్పీడ్‌ 3.87 శాతంగా ఉంది (2020 ఇదే నెలతో పోల్చి). జనవరిలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 1.87 శాతంగా ఉంది.  ఇందులో వేర్వేరుగా చూస్తే ఆయిల్, ఫ్యాట్స్‌ విభాగంలో ధరలు ఏకంగా 20.78 శాతం పెరిగాయి. పండ్ల ధరలు 6.28 శాతం ఎగశాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 6.27 శాతం తగ్గాయి. జనవరిలో ఈ తగ్గుదల ఏకంగా 15.84 శాతం ఉండడం గమనార్హం. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 2.59 శాతం పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 12.54 శాతం ఎగశాయి. గుడ్ల ధరలు 11.13 శాతం పెరిగాయి. ఇక  ‘ప్యూయెల్‌ అండ్‌ లైట్‌’ విభాగంలో ద్రవ్యోల్బణం 3.53 శాతంగా నమోదయ్యింది. హెల్త్‌ కేటగిరీ ద్రవ్యోల్బణం 6.33 శాతంగా ఉంటే, రవాణా, కమ్యూనికేషన్ల విభాగంలో ధరల స్పీడ్‌ 11.36 శాతంగా ఉంది.

మరిన్ని వార్తలు