ఒక్కరోజులోనే రూ. 2.27 లక్షల కోట్లకు పైగా లాభం

9 May, 2023 08:17 IST|Sakshi

వారాంతాన పతన బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలక్కొట్టిన బంతిలా పైకెగశాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సమయం గడిచేకొద్దీ మార్కెట్లు మరింత జోరు చూపాయి. వెరసి సెన్సెక్స్‌ 710 పాయింట్లు జంప్‌చేసి 61,764కు చేరగా.. నిఫ్టీ సైతం 195 పాయింట్లు పురోగమించి 18,264 వద్ద ముగిసింది. 

ముంబై: ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న ర్యాలీ ప్రభావంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడింది. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించింది. వారాంతాన యూఎస్‌ మార్కెట్లు భారీగా లాభపడగా.. ఫెడ్‌ రేట్ల పెంపునకు బ్రేక్‌పడనున్న అంచనాలు వడ్డీ ప్రభావిత రంగాలకు బూస్ట్‌నిచ్చాయి. ఫలితంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియల్టీ రంగాలకు జోష్‌ వచ్చింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్, రియల్టీ 1.7 శాతం చొప్పున ఎగశాయి.

ఈ నేపథ్యంలో మార్కెట్లు దాదాపు ఇంట్రాడే గరిష్టాల సమీపంలోనే ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 800 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 218 పాయింట్లు జమ చేసుకుంది. యూఎస్‌ బ్యాంకింగ్‌ రంగ సమస్యలు తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు సైతం ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగా ఆటో, రియల్టీ, బ్యాంకింగ్‌ రంగాల పటిష్ట ఫలితాలు సైతం ఇందుకు జత కలసినట్లు పేర్కొన్నారు. అయితే ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1 శాతం, మీడియా 0.6 శాతం చొప్పున డీలాపడ్డాయి. 

బ్లూచిప్స్‌ ర్యాలీ 
నిఫ్టీ–50 దిగ్గజాలలో 8 షేర్లు మాత్రమే నష్టపోయాయి. బ్లూచిప్స్‌లో ఇండస్‌ఇండ్, టాటా మోటార్స్, బజాజ్‌ త్రయం, ఓఎన్‌జీసీ, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్, ఎంఅండ్‌ఎం, యాక్సిస్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, మారుతీ, ఆర్‌ఐఎల్, ఐసీఐసీఐ, టాటా స్టీల్‌ 5–1 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే క్యూ4 ఫలితాలు నిరాశపరచడంతో కోల్‌ ఇండియా షేరు 2 శాతం క్షీణించి రూ. 233 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో కలిపి కోటికిపైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ బాటలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్, బ్రిటానియా, ఎల్‌అండ్‌టీ 1.5–0.4 శాతం మధ్య నీరసించాయి. రియల్టీ కౌంటర్లలో మహీంద్రా లైఫ్, లోధా, శోభా, డీఎల్‌ఎఫ్, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 3.7–1.4 శాతం మధ్య లాభపడ్డాయి.  

చిన్న షేర్లు గుడ్‌ 
మార్కెట్ల బాటలో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 1–0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,998 లాభపడగా.. 1,654 వెనకడుగు వేశాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 778 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,199 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి.

స్టాక్‌ హైలైట్స్‌ 

ప్రోత్సాహకర ఫలితాలు (క్యూ4) ప్రకటించిన స్మాల్‌ క్యాప్‌ ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 540 వద్ద నిలిచింది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్‌ ఏకంగా 43 శాతం లాభపడింది.  

క్యూ4లో కన్సాలిడేటెడ్‌ నష్టం భారీగా తగ్గడంతో పేటీఎమ్‌ మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 724 వద్ద ముగిసింది. 

ఇన్వెస్టర్ల సంపద జూమ్‌ 
మార్కెట్లు జోరందుకోవడంతో సోమవారం ఒక్క రోజులోనే లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాప్‌(విలువ) రూ. 2.27 లక్షల కోట్లకు పైగా లాభపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల విలువ రూ. 2.76 లక్షల కోట్లను దాటింది.

మరిన్ని వార్తలు