2021 ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ కంటే పవర్ ఫుల్ గా ఐఫోన్ 12ప్రో

20 Dec, 2020 16:11 IST|Sakshi

క్వాల్‌కామ్ ప్రతి సంవత్సరం డిసెంబరులో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం శక్తివంతమైన ప్రాసెసర్‌ను తీసుకొస్తుంది. ఈ ప్రాసెసర్‌ను వచ్చే ఏడాది రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఉపయోగిస్తారు. అలాగే, ఈ ఏడాది కూడా క్వాల్‌కామ్ కంపెనీ స్నాప్‌డ్రాగన్ 888 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రాసెసర్‌ని 2021లో అన్ని ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్‌లలో తీసుకొస్తారు. కానీ ఒక విషయం ఏమిటంటే కొత్తగా తీసుకొచ్చిన స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఈ ఏడాది విడుదలైన ఆపిల్ యొక్క ప్రాసెసర్ కంటే శక్తివంతమైనది కాదని నిరూపితమైంది.(చదవండి: పబ్జి గేమ్ లాంచింగ్ ఇప్ప‌ట్లో లేన‌ట్లే..)

ఇటీవల కొత్తగా క్వాల్‌కామ్ తీసుకొచ్చిన స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ యొక్క బెంచ్‌మార్క్ సమాచారం బయటకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ని ఆపిల్ యొక్క ఏ14 బయోనిక్, ఆపిల్ ఏ13 ప్రాసెసర్ స్కోర్‌లతో పోల్చారు. సీపీయూ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ 5లో ఈ మూడింటిని పరీక్షించారు. సింగిల్ కోర్ పనితీరులో ఆపిల్ ఐఫోన్ 12ప్రో(ఎ14 బయోనిక్) 1603 స్కోరు సాధించింది. అలాగే, స్నాప్‌డ్రాగన్ 888 1135తో ఎ14 బయోనిక్ కంటే తక్కువ స్కోరు సాధించింది. ఇంకా చెప్పాలంటే ఐఫోన్ 11 ప్రో(ఎ13) 1331 స్కోరు కంటే తక్కువ. మల్టీకోర్ పనితీరు ఆధారంగా చుస్తే స్నాప్‌డ్రాగన్ 888 యొక్క 3794 స్కోర్ తో పోలిస్తే ఐఫోన్ 12ప్రో 4187 స్కోరు సాధించింది.

అలాగే గ్రాఫిక్స్ పనితీరును పరీక్షించే వెబ్‌సైట్ జిఎఫ్ఎక్స్ లో జీపీయు పనితీరును కూడా పరీక్షించారు. ఫలితాల ప్రకారం, ఐఫోన్ 12 ప్రో సెకనుకు 102.2 పీక్ ఫ్రేమ్‌లను సాధించింది. స్నాప్‌డ్రాగన్ 888 సెకనుకు 86 పీక్ ఫ్రేమ్‌లకు మాత్రమే చేరుకుంది. ఇది ఐఫోన్ 12, ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11, ఐఫోన్ ఎస్‌ఇ(2020) స్కోర్‌ల కంటే కూడా తక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే 2021లో తీసుకురాబోయే అన్ని ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ కంటే 2020లో వచ్చిన ఐఫోన్ 12ప్రో శక్తివంతమైనది అని తెలుస్తుంది.

అయితే, గీక్‌బెంచ్, జిఎఫ్ఎక్స్ బెంచ్ ఫలితాలలో, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ప్రస్తుత హై-ఎండ్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లైన గెలాక్సీ నోట్ 20 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా, హువావే 40 ప్రో, ఆసుస్ రోగ్ ఫోన్ కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. స్నాప్‌డ్రాగన్ 888, ఆపిల్ ఏ14 బయోనిక్ ప్రాసెసర్‌లు 5ఎన్ఎమ్ ప్రాసెస్‌పై తయారు చేయబడ్డాయి. క్వాల్కమ్ యొక్క చిప్‌సెట్లో ఏ14 బయోనిక్‌లో ఉపయోగించిన మాదిరిగానే కార్టెక్స్ X-1ను దాని పెద్ద-చిన్న డిజైన్‌లో ఉపయోగించారు. 

మరిన్ని వార్తలు