ఐపీవోల జోరు

27 Sep, 2023 02:24 IST|Sakshi

కాంటార్‌ స్పేస్‌ రూ. 93 

జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాకు గిరాకీ 

ఐపీవోకు ఫిన్‌కేర్, వెస్టర్న్‌ క్యారియర్స్‌ 

ఇటీవల దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్‌ కళకళలాడుతోంది. పలు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు వస్తున్నాయి. నిధుల సమీకరణ ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టవుతున్నాయి. పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో ఇష్యూలు విజయవంతంకావడంతోపాటు.. పలు కంపెనీలు లాభాలతో లిస్టవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంటార్‌ స్పేస్‌ ఐపీవో బుధవారం ప్రారంభంకానుండగా.. జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా ఇష్యూ ముగియనుంది. మరోవైపు మరో రెండు కంపెనీలు ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు సెబీ నుంచి అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం.. 

ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌లో.. 
కోవర్కింగ్‌ కార్యాలయ సంస్థ కాంటార్‌ స్పేస్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 93 ధరను ప్రకటించింది. బుధవారం(27న) ప్రారంభంకానున్న ఇష్యూ అక్టోబర్‌ 3న ముగియనుంది. ఇష్యూలో భాగంగా 16.8 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 15.62 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కంపెనీ లిస్ట్‌కానుంది.

ఇష్యూ నిధులను కొత్త వర్కింగ్‌ కేంద్రాల అద్దె డిపాజిట్ల చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలతోపాటు.. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 1,200 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2018లో ఏర్పాటైన కంపెనీ 46,000 చదరపు అడుగులకుపైగా వర్కింగ్‌ స్పేస్‌లను నిర్వహిస్తోంది. థానే, పుణే, బీకేసీలలో 1,200 సీట్లను కలిగి ఉంది. 

జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా 
మౌలిక సదుపాయాల రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఐపీవోకు రెండో రోజు మంగళవారానికల్లా 2.13 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం కంపెనీ 13,62,83,186 షేర్లను ఆఫర్‌ చేయగా.. 29,02,18,698 షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 3.7 రెట్లు, రిటైలర్లు 4.5 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు.

అయితే అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో 55 శాతమే బిడ్స్‌ లభించాయి. షేరుకి రూ. 113–119 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 2,800 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. శుక్రవారం యాంకర్‌ ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం ద్వారా రూ. 1,260 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇష్యూ నిధుల్లో ప్రధానంగా రూ. 800 కోట్లు రుణ చెల్లింపులు, ఎల్‌పీజీ టెర్మినల్‌ ప్రాజెక్టు పెట్టుబడులకు రూ. 866 కోట్లు చొప్పున వెచ్చించనుంది.  

రెండు కంపెనీలు రెడీ 
క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టేందుకు రెండు కంపెనీలను అనుమతించింది. ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, లాజిస్టిక్స్‌ సంస్థ వెస్టర్న్‌ క్యారియర్స్‌(ఇండియా) లిమిటెడ్‌ నిధుల సమీకరణకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చంది. ఐపీవో కోసం ఈ ఏడాది మే, జూన్‌లలో సెబీకి దరఖాస్తు చేశాయి. ఫిన్‌కేర్‌ ఎస్‌ఎఫ్‌బీ ఐపీవోలో భాగంగా రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.

వీటికి జతగా మరో 1.7 కోట్ల షేర్లను ప్రమోటర్‌సహా ఇతర ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్‌ అవసరాలరీత్యా టైర్‌–1 పెట్టుబడులకు కేటాయించనుంది. ఇక వెస్టర్న్‌ క్యారియర్స్‌ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని ఇష్యూలో భాగంగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 93.29 లక్షల షేర్లను ప్రమోటర్‌ రాజేంద్ర సేథియా ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.

వాప్కోస్‌ వెనకడుగు 
కన్సల్టెన్సీ, ఈపీసీ, కన్‌స్ట్రక్షన్‌ సర్వి సుల పీఎస్‌యూ.. వ్యాప్కోస్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూని విరమించుకుంది. ప్రభుత్వం వాటా విక్రయించే యోచనలో ఉన్న కంపెనీ ఐపీవో చేపట్టేందుకు గతేడాది సెప్టెంబర్‌ 26న సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఈ నెల 21న ఇష్యూని విరమించుకున్నట్లు సెబీకి నివేదించింది. అయితే ఇందుకు కారణాలు తెలియరాలేదు. ఇష్యూలో భాగంగా తొలుత ప్రమోటర్‌ అయిన ప్రభుత్వం 3,25,00,000 షేర్లను విక్రయించాలని భావించింది. జల్‌ శక్తి నియంత్రణలోకి కంపెనీ 2021–22లో రూ. 2,798 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 69 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది.

మరిన్ని వార్తలు