ప్రపంచ చరిత్రలో భారీ సైబర్ దాడి.. వందల కోట్లు డిమాండ్!

5 Jul, 2021 17:35 IST|Sakshi

అగ్రరాజ్యం అమెరికాలో అతిపెద్ద సైబర్/రాన్‌సమ్‌వేర్ దాడి చోటు చేసుకుంది. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ కెసయా వీఎస్ఏపై హ్యాకర్లు దాడి చేశారు. ఈ దాడి తర్వాత 70 మిలియన్ డాలర్లను వారు డిమాండ్ చేశారు. భారతీయ కరెన్సీలో దీని విలువ 520 కోట్ల రూపాయలు. డార్క్ వెబ్‌సైట్ హ్యాపీ బ్లాగ్ ద్వారా ఈ దాడికి పాల్పడినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుమానిస్తుంది. సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ కెసయాపై దాడి చేయడంతో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్న ఇతర కార్పొరేట్ కంపెనీలకు ఈ వైరస్ వేగంగా వ్యాపించింది. 

ఈ సైబర్ దాడి వెనుక రష్యాతో సంబంధాలున్న ఆర్ఈవిల్ రేన్సమ్‌వేర్ గ్యాంగ్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడి నుంచి వెనక్కి తగ్గాలంటే 70 మిలియన్ డాలర్ల చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డీల్ కనుక ఒకే అయితే, సైబర్ ప్రపంచంలో ఇదే అతిపెద్ద సైబర్ దాడి అవుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ కసేయాకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, యూకే సహా అనే దేశాలలో ఉన్న 200 కంపెనీల డేటాను రాన్‌సమ్‌వేర్ గ్యాంగ్స్ అటాక్ చేసినట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. ఈ దాడి మూలాలు ఎక్కడున్నాయనే అంశంపై వారు దర్యాప్తు ప్రారంభించారు.

గత నెలలో జెనీవాలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైబర్ దాడుల విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రస్తావించారు. ఇలాంటి దాడులకు కళ్లెం వేయాల్సిన బాధ్యత రష్యా అధ్యక్షుడిపై ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ గ్యాంగ్స్ దూకుడుకు  అమెరికా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు సాగిస్తోన్న నేపథ్యంలో తాజాగా దాడి సంభవించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ గ్యాంగ్ ఇది వరకు కూడా కొన్ని మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ.. ఈ సారి తీవ్రత అంచనాలకు మించి ఉన్నట్లు సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు