రవిశాస్త్రి బాగానే పనిచేస్తున్నప్పుడు ద్రవిడ్‌ ప్రస్తావన ఎందుకు..? 

5 Jul, 2021 17:27 IST|Sakshi

ముంబై: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రిని బాధ్యున్ని చేస్తూ.. అతనిపై వేటు వేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ అతనికి మద్దతు పలికాడు. కోచ్‌ బాధ్యతలను రవిశాస్త్రి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నప్పుడు అతన్ని తొలగించాలని డిమాండ్‌ చేయడంలో అర్ధం లేదన్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ రూపంలో కొత్త కోచ్‌ను తయారు చేసుకోవడంలో తప్పేమీలేదు కానీ, కోచ్‌ మార్పు విషయమై అనవసర చర్చల వల్ల జట్టు ప్రదరన్శ లయ తప్పుతుందని అభిప్రాయపడ్డాడు. 

మూడు సంవత్సరాల పాటు కోచ్‌గా రవిశాస్త్రి బాగానే పని చేశాడని, ఇప్పుడు అనసరంగా ద్రవిడ్‌ ప్రస్తావన తెచ్చి కొత్త సమస్యలకు తెరలేపొద్దని ఆయన విజ్ఞప్తి చేశాడు. ర‌విశాస్త్రి మంచి పనితీరు కొన‌సాగిస్తుంటే.. అత‌న్ని తొల‌గించాల్సిన అవ‌స‌రం లేదని, ఈ చ‌ర్చ ఆటగాళ్లతో పాటు, ఇరు జట్ల కోచ్‌ల‌పై అన‌వ‌స‌రమైన ఒత్తిడి క‌లిగిస్తుంది అని క‌పిల్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయన టీమిండియా రిజర్వ్‌ బెంచ్ బలంపై ప్రశంసల వర్షం కురిపించాడు. రెండు వేర్వేరు జట్లను పంపించే అరుదైన అవ‌కాశం బీసీసీఐకి క‌లిగిందంటే, ఆ ఘనత టీమిండియా రిజర్వ్‌ బెంచ్‌కే దక్కుతుందన్నాడు. భారత రెండు జట్లు ఇంగ్లండ్‌, శ్రీలంక‌ల్లో విజ‌యాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. 

కాగా, కోహ్లీ నేతృత్వంలో భారత రెగ్యులర్‌ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండ‌గానే ధవన్‌ సారధ్యంలో మ‌రో జట్టు శ్రీలంక‌కు వెళ్లింది. ఈ జట్టుకు ద్రవిడ్‌ను కోచ్‌గా నియ‌మించ‌డంతో కోచ్‌ మార్పుపై మరోసారి చ‌ర్చ మొదలైంది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న ర‌విశాస్త్రి ప‌ద‌వీకాలం ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న టీ20 ప్రపంచక‌ప్‌తో ముగియ‌నుంది. దీంతో అత‌ని త‌ర్వాత కోచ్ రేసులో ద్రవిడ్ ఉన్నాడ‌ని బీసీసీఐ పరోక్ష సంకేతాలు పంపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు