Kia India-AP: కియా అనంత ప్లాంట్‌ కొత్త రికార్డ్‌ 

23 Feb, 2022 00:53 IST|Sakshi

5 లక్షలకుపైగా యూనిట్ల సరఫరా 

29 నెలల్లోనే మైలురాయి చేరిక 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా కొత్త మైలురాయిని అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ ప్లాంట్‌ నుంచి 5 లక్షలకుపైగా యూనిట్లను భారత్‌తోపాటు విదేశాలకు సరఫరా చేసింది. దేశీయంగా 4 లక్షల యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది. లక్షలకుపైగా కార్లను 91 దేశాలకు ఎగుమతి చేసింది. 2019 సెపె్టంబర్‌లో అనంతపూర్‌ ప్లాంట్‌ నుంచి సెల్టోస్‌ కార్ల ఎగుమతి ప్రారంభమైంది.

భారత్‌ నుంచి విదేశాలకు  యుటిలిటీ వాహనాలను అధికంగా సరఫరా చేస్తున్న కంపెనీల్లో ఒకటైన కియా ఇండియా.. గతేడాది ఎగుమతుల్లో 25 శాతంపైగా వాటాను దక్కించుకుంది. ‘అయిదు లక్షల యూనిట్లు అనేది పెద్ద సంఖ్య. 29 నెలల్లోపే ఈ మైలురాయిని చేరుకున్నందుకు గర్విస్తున్నాం. భారత్‌లో మా ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుండీ అద్భుతమైన ఉత్పత్తులు, సేవల ద్వారా కస్టమర్లకు గొప్ప విలువను అందించడంపై దృష్టి సారించాం.

నాలుగు లక్షల భారతీయ కుటుంబాలలో భాగమయ్యాం. వినియోగదార్లు మాపై చూపిన అభిమానానికి చాలా కృతజ్ఞతలు. కొత్త కారు కరెన్స్‌తో తదుపరి మైలురాళ్లను మరింత వేగంగా చేరుకోగలం. కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించడం ద్వారా దేశంలో వృద్ధి ప్రయాణంలో ఈ కారు మార్గనిర్దేశం చేస్తుంది’ అని కియా ఇండియా ఎండీ, సీఈవో టే జిన్‌ పార్క్‌ ఈ సందర్భంగా తెలిపారు.   

మరిన్ని వార్తలు