రియల్టీకి కలిసొచ్చిన 2021.. ఇళ్ల విక్రయాల్లో జోరు

6 Jan, 2022 09:11 IST|Sakshi

51 శాతం అధిక విక్రయాలు 

నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా   

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 8 ప్రముఖ పట్టణాల్లో గతేడాది ఇళ్ల విక్రయాలు అధికంగా నమోదయ్యాయి. 2020లో విక్రయాలతో పోలిస్తే గతేడాది 51 శాతం పెరిగాయి. 2020లో 1.54,534 యూనిట్లు అమ్ముడుపోగా, 2021లో 2,32,903 యూనిట్లు విక్రయమయ్యాయి. కానీ, 2019లో విక్రయాలతో పోలిస్తే గతేడాది అమ్మకాలు 5 శాతం తక్కువగానే ఉన్నాయి. 2011లో నమోదైన గరిష్ట విక్రయాలతో పోలిస్తే 37 శాతం తక్కువ. ఈ వివరాలను నైట్‌ఫ్రాంక్‌ ఇండియా ‘ఇండియా రియల్‌ ఎస్టేట్‌ 2021’ నివేదిక రూపంలో విడుదల చేసింది.

ఆఫీస్‌ స్పేస్‌
కార్యాలయ స్థలాల విభాగంలో స్థూల లీజు (ఆఫీసు స్పేస్‌ కిరాయికి ఇవ్వడం) పరిమాణం 38.1 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది. 2020లో ఇది 39.4 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. ‘‘కార్యాలయ స్థలాల మార్కెట్‌పై కరోనా రెండో విడత ప్రభావం పడింది. 2019లో లీజు స్థలం 60.6 మిలియన్‌ చదరపు అడుగులతో పోలిస్తే గతేడాది తక్కువగానే నమోదైంది. కరోనా  కల్పించిన అసాధారణ పరిస్థితులు, లాక్‌డౌన్‌లు ఉన్నప్పటికీ 2021లో రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ బలమైన పనితీరు చూపించింది’’ అని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు.

హైదరాబాద్‌లో రెండు రెట్లు అధిక విక్రయాలు 
హైదరాబాద్‌ మార్కెట్లో 2021లో 24,318 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెండు రెట్లు అధికం. కార్యాలయ స్థలాల లీజు మార్పు లేకుండా(ఫ్లాట్‌గా) 6 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది. ముంబై మార్కెట్లో ఇళ్ల విక్రయాలు 29 శాతం పెరిగి 62,989 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో విక్రయాలు 48,688 యూనిట్లు కావడం గమనార్హం.

చదవండి:హైదరాబాద్‌కి షాకిచ్చిన జేఎల్‌ఎల్‌ ఇండియా వార్షిక ఫలితాలు 
 

మరిన్ని వార్తలు