భారత్‌పే సహ వ్యవస్థాపకుడికి లుకౌట్‌ నోటీసు జారీ.. ఎందుకంటే..

18 Nov, 2023 17:22 IST|Sakshi

భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్‌లను గురువారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు.  న్యూయార్క్‌కు వెళ్లే విమానం ఎక్కకుండా చర్యలు తీసుకున్నారు. అయితే భారత్‌పేలో జరిగిన మోసంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఇటీవల లుకౌట్ సర్క్యులర్‌ను జారీ చేసింది. దాంతో వారిని దిల్లీలోని విమానాశ్రయంలో అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

న్యూయార్క్‌లో విహారయాత్రకు బయలుదేరిన అష్నీర్‌ దంపతులను విమానాశ్రయంలో భద్రతా తనిఖీకి ముందే ఆపివేసినట్లు ఈఓడబ్ల్యూ జాయింట్ కమిషనర్ సింధు పిళ్లై చెప్పారు. దిల్లీలోని వారి నివాసానికి తిరిగి రావాలని సూచించినట్లు తెలిపారు. వచ్చే వారం మందిర్ మార్గ్‌లోని ఈఓడబ్ల్యూ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వారిని కోరారు. వారి అంతర్జాతీయ ప్రయాణాన్ని నిలిపేసేందుకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశామని, వారిని అధికారికంగా అరెస్టు చేయలేదని పిళ్లై స్పష్టం చేశారు.

పోలీసులు చర్యలు తీసుకునేంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని అష్నీర్ గ్రోవర్ తన ఎక్స్‌ ఖాతాలో తెలిపారు. గురువారం రోజే తమను అదుపులోకి తీసుకున్నారని, కానీ శుక్రవారం రోజున వారికి నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. విమానం ఎక్కకుండా తమను ఆపిన ఏడు గంటల తర్వాత ఈఓడబ్ల్యూ నుంచి నోటీసు అందిందని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి: అమెజాన్‌ అలెక్సా.. వందల ఉద్యోగులపై వేటు

భారత్‌పే సహ వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్, అతని కుటుంబ సభ్యులు సంస్థ నిధులను దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు దాఖలయ్యాయి. గతంలో వారు అందించని ఫిన్‌టెక్‌ సేవల కోసం బ్యాక్‌డేటెడ్ ఇన్‌వాయిస్‌లను ఉపయోగించినట్లు  తెలిసింది. ఇందుకు సంబంధించిన చెల్లింపులను గుర్తించడంలో ఈఓడబ్యూ సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. డిసెంబర్ 2022లో భారత్‌పే అష్నీర్ గ్రోవర్, తన భార్య, కుటుంబ సభ్యుల ద్వారా రూ.81.28 కోట్ల మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ క్రిమినల్ కేసు దాఖలయింది.

మరిన్ని వార్తలు