మహీంద్రా లాభం 88 శాతం డౌన్‌

11 Nov, 2020 04:57 IST|Sakshi

రూ.11,590 కోట్లకు ఆదాయం

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) రెండో త్రైమాసిక కాలంలో 88 శాతం మేర తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ2లో రూ.1,355 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.162 కోట్లకు తగ్గిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించి రూ.1,149 కోట్ల ఇంపెయిర్‌మెంట్‌ కేటాయింపుల కారణంగా ఈ క్యూ2లో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. ఆదాయం రూ.10,935 కోట్ల నుంచి రూ.11,590 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  

అమ్మకాలు 21 శాతం డౌన్‌.... 
గత క్యూ2లో 1.10 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ2లో 21 శాతం తగ్గి 87,332కు పరిమితమయ్యాయని కంపెనీ తెలిపింది. ట్రాక్టర్‌ అమ్మకాలు మాత్రం 68,359 నుంచి 31 శాతం ఎగసి 89,597కు చేరాయని పేర్కొంది.  

అమ్మకాలు పుంజుకుంటాయ్‌...! 
ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెంచుతుండటం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ రికవరీ అవుతుండటం సానుకూలాంశాలని కంపెనీ పేర్కొంది. దేశీయ ఆర్థిక స్థితిగతులను సరిదిద్దడానికి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు, ఇటీవలి వ్యవసాయ సంస్కరణలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేవని, తమ అమ్మకాలు రానున్న క్వార్టర్లలో పుంజుకోగలవని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.  ఆస్ట్రేలియాలో గిప్స్‌ ఏరో పేరుతో ఉన్న విమానాల తయారీ వ్యాపారాన్ని మూసేస్తున్నామని కంపెనీ తెలిపింది. బీఎస్‌ఈలో మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 0.5 శాతం లాభంతో రూ.620 వద్ద ముగిసింది.    

మరిన్ని వార్తలు