సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులకు కేంద్రంగా భారత్‌

21 Aug, 2020 06:11 IST|Sakshi

పరిశ్రమకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సూచన

న్యూఢిల్లీ: ప్రస్తుత విధానాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ భారత్‌ను సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడంపై ఐటీ సంస్థలు దృష్టి పెట్టాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ సూచించారు. వినూత్నమైన మేడిన్‌ ఇండియా ఉత్పత్తులను అందించాలని పేర్కొన్నారు. దేశీ వీడియో కాన్ఫరెన్స్‌ సొల్యూషన్లు, యాప్స్‌ రూపకల్పన ద్వారా కరోనా వైరస్‌పరమైన భారీ సవాళ్లను పరిశ్రమ అసాధారణ రీతిలో ఎదుర్కొందని ప్రశంసించారు. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఐటీ, కమ్యూనికేషన్స్‌ రంగంలోకి భారీ పెట్టుబడులు వచ్చాయని.. ప్రపంచమంతా భారత్‌ని విశ్వసించడమే ఇందుకు కారణమని ప్రసాద్‌ చెప్పారు.

వీడియో కాన్ఫరెన్స్‌ సొల్యూషన్‌ రూపకల్పన పోటీల విజేతలను ప్రకటించిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వీకన్సోల్‌ అనే వీడియో కాన్ఫరెన్స్‌ సొల్యూషన్‌ రూపొందించిన కేరళకు చెందిన టెక్‌జెన్సియా సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ ఈ పోటీలో విజేతగా నిల్చింది. విజేతకు రూ. 1 కోటి ఆర్థిక సహాయం, అదనంగా మూడేళ్ల పాటు నిర్వహణ వ్యయాల కోసం రూ. 10 లక్షలు అందించడం జరుగుతుందని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సర్వ్‌ వెబ్స్, పీపుల్‌లింక్‌ యూనిఫైడ్‌ కమ్యూనికేషన్స్, ఇన్‌స్ట్రైవ్‌ సాఫ్ట్‌ల్యాబ్స్‌ సంస్థలు రూపొందించిన ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేయడానికి ఆస్కారమున్న సొల్యూషన్స్‌గా జ్యూరీ ఎంపిక చేసింది. వీటికి తలో రూ. 25 లక్షల మద్దతు లభించనుంది. 

మరిన్ని వార్తలు