మార్కెట్లు వీక్‌- షుగర్‌ షేర్లు స్వీట్‌

26 Nov, 2020 12:07 IST|Sakshi

ఆటుపోట్ల మధ్య నష్టాల బాటలో మార్కెట్లు

లిస్టెడ్‌ షుగర్‌ కంపెనీలకు భారీ డిమాండ్‌

అనూహ్య లాభాలతో ట్రేడవుతున్న పలు షేర్లు

క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌) ఫలితాలపై అంచనాల ఎఫెక్ట్‌

ముంబై, సాక్షి: లాభాల స్వీకరణ కోసం ట్రేడర్ల అమ్మకాలు, సరికొత్త గరిష్టాలకు చేరడంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత వంటి అంశాలతో స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 147 పాయింట్లు క్షీణించి 43,681 వద్ద ట్రేడవుతోంది. అయితే ఆటుపోట్ల మార్కెట్లోనూ ఉన్నట్టుండి చక్కెర తయారీ రంగ కంపెనీలకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో దాదాపు లిస్టెడ్‌ షుగర్‌ కంపెనీల షేర్లన్నీ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

కారణాలున్నాయ్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో షుగర్‌ కంపెనీలు అంచనాలను మించిన ఫలితాలు సాధించాయి. ఇందుకు కంపెనీలు చేపట్టిన వ్యయాల కోత, లాభదాయకత మెరుగుపడటం వంటి అంశాలు సహకరించాయి. ప్రధానంగా క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో నిర్వహణ నగదు లాభాలు పెరగడం, వర్కింగ్‌ క్యాపిటల్ రుణాలు తగ్గడం చక్కెర కౌంటర్లకు ఆకర్షణను తీసుకువచ్చినట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి. దీనికితోడు డిస్టిల్లరీ విభాగాల నుంచి ఆదాయాలు పుంజుకోవడం చక్కెర పరిశ్రమకు మద్దతిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నాయి. అక్టోబర్‌ చివర్లో ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్‌ ఇథనాల్‌ ధరలను 2 శాతం పెంచి 6 శాతానికి చేర్చింది. ఈ డిసెంబర్‌ నుంచి 2021 నవంబర్‌వరకూ ధరలు అమలుకానున్నాయి. తద్వారా పరిశ్రమలు చక్కెర తయారీ నుంచి ఇథనాల్‌వైపునకు మళ్లే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను మిక్స్‌ చేసే విషయం విదితమే. ఈ నేపథ్యంలో క్యూ3(అక్టొబర్‌- డిసెంబర్‌)లోనూ షుగర్‌ కంపెనీలు పటిష్ట ఫలితాలు సాధించవచ్చన్న అంచనాలు పెరుగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ అంశాలు షుగర్‌ రంగ కౌంటర్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నట్లు విశ్లేషించారు.

షేర్ల దూకుడు
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పలు చక్కెర రంగ కౌంటర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. జాబితాలో కేసీపీ, ఉత్తమ్‌, అవధ్‌, ధంపూర్‌ తదితరాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అవధ్‌ షుగర్స్‌ 12.4 శాతం ఎగసి రూ. 206 వద్ద, కేసీపీ 12 శాతం పెరిగి రూ. 17 వద్ద, మగధ్‌ 12.5 శాతం దూసుకెళ్లి రూ. 116 వద్ద, ఉత్తమ్‌ 9.5 శాతం జంప్‌చేసి రూ. 99 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో దాల్మియా భారత్ 5.2 శాతం పురోగమించి రూ. 144 వద్ద, ద్వారికేష్‌ 5 శాతం పుంజుకుని రూ. 30 వద్ద, ధంపూర్‌ 4 శాతం లాభంతో రూ. 161 వద్ద ఉగర్‌ షుగర్స్‌ 5 శాతం లాభపడి రూ. 15 వద్ద కదులుతున్నాయి. ఇదే విధంగా డీసీఎం శ్రీరామ్‌, శ్రీ రేణుకా షుగర్స్‌, ఈఐడీ ప్యారీ, మవానా, శక్తి షుగర్స్‌ తదితర పలు కౌంటర్లు 9-3 శాతం మధ్య బలపడ్డాయి.  

మరిన్ని వార్తలు