చిన్న కార్ల అమ్మకాలు పెరుగుతాయి..

19 Sep, 2022 07:26 IST|Sakshi

న్యూఢిల్లీ: మొత్తం ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాల్లో చిన్న కార్ల వాటా తగ్గుతున్నప్పటికీ .. పరిమాణంపరంగా చూస్తే మాత్రం విక్రయాలు పెరుగుతాయని ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్, సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. గతంలో మొత్తం ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్లో చిన్న కార్ల వాటా 45–46 శాతం వరకూ ఉండేదని, గతేడాది 38 శాతానికి పడిపోయిందని వివరించారు. ఎస్‌యూవీలు 40 శాతం వాటాను దక్కించుకున్నాయని శ్రీవాస్తవ చెప్పారు.

అయితే సంఖ్యాపరంగా చూస్తే చిన్న కార్ల విభాగం ఇప్పటికీ భారీ స్థాయిలోనే ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 30.7 లక్షల కార్లు అమ్ముడు కాగా వాటిలో దాదాపు 40 శాతం వాటా హ్యాచ్‌బ్యాక్‌లదేనని (దాదాపు 12 లక్షలు), మరో 12.3 లక్షల ఎస్‌యూవీలు (సుమారు 40 శాతం) అమ్ముడయ్యాయని శ్రీవాస్తవ వివరించారు. ఆ రకంగా చుస్తే పరిమాణంపరంగా రెండింటికీ మధ్య భారీ వ్యత్యాసమేమీ లేదని పేర్కొన్నారు.  

యువ జనాభా, కొత్తగా ఉద్యోగంలోకి చేరే యువత తొలిసారిగా కొనుగోలు చేసేందుకు చిన్న కార్లనే ఎంచుకునే అవకాశాలు ఉండటం ఈ విభాగానికి దన్నుగా ఉండగలదని ఆశిస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. అయితే, ఈ విభాగం కొనుగోలుదారులు ఎక్కువగా అందుబాటు ధరకు ప్రాధాన్యమిస్తారని, అదే అంశం చిన్న కార్లకు కొంత సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. కొత్త ప్రమాణాలను పాటించాల్సి వస్తుండటం, కమోడిటీ ధరలు పెరుగుతుండటం, కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాల్సి వస్తుండటం తదితర అంశాల కారణంగా.. చిన్న కార్లు అందుబాటు రేటులో లభించడం తగ్గుతోందని ఆయన వివరించారు. ‘గత రెండు మూడేళ్లలో ఆదాయం కన్నా ఎక్కువగా వాహనాల ధరలు పెరిగిపోయాయి. దీంతో అందుబాటులో లభ్యతనేది తగ్గిపోయింది. అందుకే ఎస్‌యూవీలతో పోలిస్తే ఈ విభాగం వాటా తగ్గిందని భావిస్తున్నాం‘ అని శ్రీవాస్తవ వివరించారు.

చదవండి: బిగ్‌ అలర్ట్: అమలులోకి ఆధార్‌ కొత్త రూల్‌..వారికి మాత్రం మినహాయింపు!

>
మరిన్ని వార్తలు