చిన్న రుణాలకు మళ్లీ గిరాకీ.. బ్యాంకులను అధిగమించి, 40 శాతం వాటాతో

29 Aug, 2023 08:56 IST|Sakshi

ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్‌ఐలు) లాభదాయకత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.7–3 శాతానికి మెరుగుపడుతుందని ఇక్రా రేటింగ్స్‌ పేర్కొంది. మెరుగైన వసూళ్లు, తక్కువ రుణ వ్యయాలు, కొత్త రుణాలపై అధిక రేట్లు ఇవన్నీ లాభదాయకత పెరగడానికి అనుకూలతలుగా తెలిపింది. ఎంఎఫ్‌ఐలు కరోనా మహమ్మారి రాకతో కుదేలు కాగా, ఆ తర్వాత వేగంగా కోలుకుని సూక్ష్మ రుణాల్లో బ్యాంకులను అధిగమించి, 40 శాతం వాటాతో మొదటి స్థానానికి చేరుకోవడం గమనార్హం. 2021–22 నాటికి ఉన్న 34 శాతంతో పోలిస్తే 6 శాతం మార్కెట్‌ వాటాను గత ఆర్థిక సంవత్సరంలో పెంచుకున్నాయి. సూక్ష్మ రుణాల్లో బ్యాంకుల వాటా 40 శాతం నుంచి 34 శాతానికి తగ్గింది. ఈ మేరకు ఒక నివేదికను ఇక్రా విడుదల చేసింది.  

రుణాల్లో మెరుగైన వృద్ధి 
ఎంఎఫ్‌ఐలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల పరంగా 24–26 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని ఇక్రా రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది. అంతేకాదు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25)నూ 23–25 శాతం మేర రుణ వితరణలో వృద్ధిని సాధిస్తాయని తెలిపింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంఎఫ్‌ఐల లాభదాయకత 3.2–3.5 శాతానికి పెరుగుతుందని అంచనా వ్యక్తీకరించింది. 2022–23 చివరికి నాటికి ఎంఎఫ్‌ఐల లాభదాయకత 2.1 శాతంగా ఉంది. ‘‘ఇక మీదట మంజూరు చేసే రుణాలు అధిక ధరపై ఉండడం, రుణ రేట్ల పరంగా ఆర్‌బీఐ వెసులుబాటు కల్పించడం నికర వడ్డీ మార్జిన్లను పెంచుతుంది. దీంతో ఎంఎఫ్‌ఐల లాభదాయకత పెరుగుతుంది’’ అని ఇక్రా తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన వ్యయాల్లో అధిక భాగాన్ని గత ఆర్థిక సంవత్సరంలో ఇవి సర్దుబాటు చేసుకున్నట్టు వివరించింది. అలాగే, కరోనా మహమ్మారి ముందు నాటి స్థాయికి రుణ వసూళ్లు మెరుగుపడినట్టు వెల్లడించింది. 

ఆస్తుల్లోనూ బలమైన వృద్ధి..  
ఎంఎఫ్‌ఐలు గత ఆర్థిక సంవత్సరంలో తమ నిర్వహణ ఆస్తులను (రుణాల పోర్ట్‌ఫోలియో) 38 శాతం పెంచుకున్నాయి. బ్యాంకులతో పోలిస్తే ఎంఎఫ్‌ఐలు తమ ఆస్తులను అధికంగా విస్తరించుకున్నట్టు ఇక్రా రేటింగ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సచిన్‌ సచ్‌దేవ తెలిపారు. ఒక రుణగ్రహీతకు సంబంధించి సగటు ఖాతాలు కూడా పెరిగాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఒకే రుణ గ్రహీత వెంట ఒకటికి మించిన సంస్థలు వెంటబడుతున్నట్టు తెలుస్తోందని ఇక్రా పేర్కొంది. ఇది రుణ గ్రహీతల రుణ భారాన్ని కూడా పెంచుతున్నట్టు తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం సమసిపోవడంతో, రుణ బకాయిలు పేరుకుపోవడం తగ్గుతున్నట్టు వివరించింది. 90 రోజులకు పైగా చెల్లింపులు చేయని రుణ ఖాతాలు 2021–22 మొదటి ఆరు నెలల్లో 6.2 శాతానికి పెరగ్గా, 2023 మార్చి నాటికి 2.5 శాతానికి తగ్టినట్టు పేర్కొంది. 2023–24లో వసూలు కాని రుణాలు మరో 0.4–06 శాతం క్షీణించొచ్చని అంచనా వేసింది. ఎంఎఫ్‌ఐల లిక్విడిటీ పరిస్థితులు కూడా మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది.    

మరిన్ని వార్తలు