మోల్డ్‌టెక్‌ మరో రెండు ప్లాంట్లు

1 Oct, 2021 04:00 IST|Sakshi

మూడేళ్లలో రూ.200 కోట్ల వ్యయం

టర్నోవర్‌ రూ.600 కోట్ల లక్ష్యం

గ్రూప్‌ సీఎండీ జె.లక్షణ్‌ రావు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంజెక్షన్‌ మోల్డెడ్‌ ప్లాస్టిక్‌ కంటైనర్ల తయారీ దిగ్గజం మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ మరో రెండు ప్లాంట్లను స్థాపిస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని సుల్తాన్‌పూర్‌ వద్ద ఇంజెక్షన్‌ బ్లో మౌల్డింగ్‌ (ఐబీఎం) ప్యాకేజింగ్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని రూ.50 కోట్లతో నెలకొల్పనుంది. అలాగే రూ.20 కోట్లతో ఉత్తరప్రదేశ్‌లోనూ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్టు మోల్డ్‌టెక్‌ గ్రూప్‌ సీఎండీ జె.లక్ష్మణ్‌ రావు తెలిపారు. ఫార్మా, కాస్మెటిక్స్, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల కోసం ఐబీఎం ప్యాకేజింగ్‌ విభాగంలోని ప్రవేశించిన సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ టెక్నాలజీని పరీక్షించేందుకు రూ.10 కోట్లతో పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టాం. ఐబీఎం ప్యాకేజింగ్‌ ఉత్పత్తుల మార్కెట్‌ దేశంలో 9 శాతం వృద్ధితో రూ.5,000 కోట్లు ఉంది. 2025 నాటికి ఈ రంగంలో 5–6 శాతం మార్కెట్‌ వాటాను చేజిక్కించుకుంటాం’ అని పేర్కొన్నారు.

ప్రపంచంలో ఏకైక సంస్థ..
రోబోలను వినియోగించి ప్లాస్టిక్‌ కంటైనర్లను అలంకరణకు ఇన్‌ మోల్డ్‌ లేబులింగ్‌ (ఐఎంఎల్‌) విధానాన్ని దేశంలో పరిచయం చేసిన తొలి సంస్థగా మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ రికార్డు సాధించింది. ప్రపంచంలో ఐఎంఎల్‌ డెకోరేషన్‌ కోసం రోబోలను సొంతంగా రూపకల్పన చేసి తయారు చేస్తున్న ఏకైక ప్యాకేజింగ్‌ సంస్థ కూడా ఇదే. ‘గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.480 కోట్ల టర్నోవర్‌ సాధించింది. 2021–22లో 25 శాతం వృద్ధితో రూ.600 కోట్లు ఆశిస్తోంది. మూడు నాలుగేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా చేసుకున్నాం. విస్తరణకుగాను 2024 నాటికి రూ.200 కోట్లు పెట్టుబడి చేయనున్నాం’ అని లక్షణ్‌ రావు తెలిపారు. భారత్‌లో సంస్థకు 9 తయారీ కేంద్రాలు ఉన్నాయి.
మోల్డ్‌టెక్‌ గ్రూప్‌ సీఎండీ జె.లక్ష్మణ్‌ రావు

మరిన్ని వార్తలు