‘పండోరా పేపర్స్‌’.. వారి గుట్టురట్టు చేయనున్న కేంద్రం

4 Oct, 2021 21:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతల రహస్య ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను ‘పండోరా పేపర్స్’ పేరిట ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) బహిర్గతం చేసింది. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద లీక్‌ అని భావిస్తున్నారు. పండోరా లీక్డ్‌ డాక్యుమెంట్లలో 300 మందికిపైగా భారతీయుల వివరాలున్నాయి. వీరిలో చాలామంది ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలే కావడం విశేషం. వీరు ఇప్పటికే దర్యాప్తు సంస్థల నిఘా పరిధిలో ఉన్నారు. చాలా మంది భారతీయులు ఇవి తప్పుడు ఆరోపణలను తిరస్కరించారు. 

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి 18 దేశాల్లో ఆస్తులు ఉన్నట్లు వార్తలొచ్చాయి. వీరిలో మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఉన్నారు. అయితే, ఈ నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. "పండోరా పేపర్స్" కేసు దర్యాప్తును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ నేతృత్వంలోని మల్టీ ఏజెన్సీ గ్రూప్ పర్యవేక్షిస్తున్నదని సోమవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని సంబంధిత దర్యాప్తు సంస్థలు ఈ కేసుల దర్యాప్తును చేపడతాయని, చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకొనున్నట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుల దర్యాప్తులో ఈడీ, ఆర్‌బీఐ, ఎఫ్‌ఐయూ సంస్థల ప్రతినిధులు ఈ బృందంలో కీలక పాత్ర పోషించనున్నారు. (చదవండి: నల్ల ధనవంతుల గుట్టురట్టు!)

ఇప్పటివరకు కొంతమంది భారతీయుల పేర్లు(చట్టపరమైన సంస్థలతో పాటు వ్యక్తులు) మాత్రమే మీడియాలో కనిపించాయని తెలిపింది. తాము సేకరించిన 1.2 కోట్ల పత్రాల ఆధారంగా సంపన్నుల ఆర్థిక రహస్యాలను బహిర్గతం చేసినట్లు ఐసీఐజే ట్వీట్‌ చేసింది. ఐసీఐజే వెబ్‌సైట్‌లో కూడా పేర్లను, అన్ని సంస్థల ఇతర వివరాలకు సంబంధించిన సమాచారం విడుదల చేయలేదని పేర్కొంది. ఐసీఐజే వెబ్‌సైట్‌లో దశలవారీగా సమాచారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. పండోరా పేపర్స్ దర్యాప్తుకు అనుసంధానించిన నిర్మాణాత్మక డేటా దాని ఆఫ్ షోర్ లీక్స్ డేటాబేస్ లో రాబోయే రోజుల్లో మాత్రమే విడుదల చేయనున్నట్లు సూచించింది. 117 దేశాల్లోని 150కి పైగా వార్తా సంస్థలకు చెందిన 600 మంది విలేకర్లు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీల పత్రాలను పరిశీలించి ఈ గుట్టును రట్టుచేసింది. విశ్లేషించిన మొత్తం సమాచారం పరిమాణం 2.94 టెరాబైట్ల మేర ఉంది.(చదవండి: రహస్య లావాదేవీల కుంభకోణం.. సచిన్‌కు క్లీన్‌చిట్‌!)

మరిన్ని వార్తలు